PEN POWER
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 10:55 am Posted By : PEN POWER MEDIA

కీర్తన హత్య కేసులో కీలక మలుపు

ఖాజీపేట హత్య కేసులో కీలక పరిణామం
బసాపురం చెక్‌పోస్ట్ వద్ద నిందితుడి పరారీకి యత్నం
పోలీసులపై కత్తితో దాడి చేసిన వెంకటేష్
నిందితుడు వెంకటేష్‌పై పోలీసుల కాల్పులు…
ఆత్మరక్షణలో కాల్పులు జరిపిన పోలీసులు
రిమ్స్‌లో నిందితుడికి చికిత్స

కడప | పెన్ పవర్ | ఏప్రిల్ 11:

ఖాజీపేట అగ్రహారంలో విద్యార్థిని కీర్తనను దారుణంగా హత్య చేసిన నిందితుడు వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరపడం జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసు వర్గాల సమాచారం మేరకు, కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని మరో ప్రాంతానికి తరలిస్తుండగా మైదుకూరు–బద్వేల్ ప్రధాన రహదారిలోని బసాపురం చెక్‌పోస్ట్ వద్ద అతడు తప్పించుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వెంకటేష్ పోలీసులపై కత్తితో దాడికి దిగడంతో, ఆత్మరక్షణ చర్యగా పోలీసులు అతని కాలిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు సమాచారం. బుల్లెట్ గాయంతో నిందితుడు అక్కడికక్కడే కుప్పకూలగా, వెంటనే అదుపులోకి తీసుకున్నారు.ఘటనలో కొందరు పోలీసు సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. వారికి మైదుకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు గాయపడిన వెంకటేష్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.కీర్తన హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం రేకెత్తించిన వేళ, నిందితుడిపై కాల్పులు జరగడం కేసులో కీలక మలుపుగా మారింది. బసాపురం చెక్‌పోస్ట్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు, కాల్పులకు దారితీసిన పరిణామాలపై అధికారిక ప్రకటనను పోలీసులు విడుదల చేయాల్సి ఉంది.