PEN POWER
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 11:32 am Posted By : PEN POWER MEDIA

పాత బస్సులకు కొత్త జీవం – ఎలక్ట్రిక్ మార్పుల దిశగా ఆర్టీసీ

ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణకు కేంద్రం మద్దతు
పాత బస్సుల రిట్రోఫిట్ ద్వారా ఖర్చు తగ్గింపు లక్ష్యం
విజయవాడలో ప్రయోగాత్మక ఎలక్ట్రిక్ బస్సు పరిశీలన
చార్జింగ్ సామర్థ్యం, మైలేజ్‌పై ట్రయల్ రన్స్
డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు
కాలుష్య నియంత్రణపై ఏపీ సర్కార్ దృష్టి

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విజయవాడ ఏప్రిల్ 29:


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్థిర రవాణా వ్యవస్థ అభివృద్ధి దిశగా కీలక అడుగులు వేస్తోంది. “సుస్థిర విద్యుత్ వాహన పాలసీ 4.0” కింద రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తూ, పర్యావరణ హితంగా విద్యుత్ బస్సుల వినియోగాన్ని విస్తరించే లక్ష్యంతో చర్యలు చేపడుతోంది.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రానికి 1050 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించగా, అదనంగా మరో 1450 బస్సులను సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో పాత డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించకుండా, వాటిని రీమోడల్ చేసి విద్యుత్ బస్సులుగా మార్చే వినూత్న ప్రయత్నం ప్రారంభించింది.ఇటీవల ఒక పాత సూపర్ లగ్జరీ బస్సును ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌గా తీసుకుని, దానిని పూర్తిగా విద్యుత్‌తో నడిచే ఏసీ బస్సుగా మార్చారు. ఈ ప్రక్రియను కళ్యాణీ ట్రాన్స్ సంస్థ (భారత్ ఫోర్జ్) ప్రయోగాత్మకంగా నిర్వహించింది. “ఇంద్ర సర్వీస్” పేరిట రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ బస్సును విజయవాడ ఆర్టీసీ హౌస్‌కు తీసుకువచ్చి అధికారులు పరిశీలించారు.ఈ బస్సును త్వరలో ఒక ఎంపిక చేసిన మార్గంలో ట్రయల్ రన్ కోసం నడపాలని నిర్ణయించారు. ఈ పరీక్షల ద్వారా ఒకసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణించగలదో, ఛార్జింగ్ సమయం, నిర్వహణ ఖర్చులు వంటి అంశాలను సమగ్రంగా అంచనా వేయనున్నారు.ఇంకా, కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడం కంటే పాత బస్సులను రిట్రోఫిట్ చేయడం ఎంతవరకు లాభదాయకమో కూడా ప్రభుత్వం విశ్లేషిస్తోంది. ఖర్చు, పనితీరు, దీర్ఘకాల ప్రయోజనాలను పరిశీలించి భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఈ విధానాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.ఇప్పటికే చిత్తూరు డిపోలో ఒక డీజిల్ బస్సును సీఎన్జీ బస్సుగా మార్చి విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఈ అనుభవంతో ఇప్పుడు విద్యుత్ మార్పులపై మరింత దృష్టి పెట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 11 వేల బస్సులు నడుస్తుండగా, రోజుకు సుమారు 7.5 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతోంది. ప్రస్తుతం డీజిల్ కొరత ఎలాంటి సమస్యగా లేదని, ఆయిల్ కంపెనీలతో నిరంతరం సమన్వయం కొనసాగుతోందని తెలిపారు.