PEN POWER
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 7:11 pm Posted By : PEN POWER MEDIA

విమాన ప్రయాణికులకు షాక్‌..

విమాన ప్రయాణికులకు పెద్ద షాక్‌గా, 60 శాతం ఫ్రీ సీట్ల నిబంధనను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రయాణికుల ఫిర్యాదులతో తీసుకొచ్చిన ఈ నిర్ణయంపై ఎయిర్‌లైన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆదాయం తగ్గిపోతుందని, టికెట్ ధరల సమతుల్యత దెబ్బతింటుందని సంస్థలు వాదించాయి. దీంతో సమగ్ర సమీక్ష వరకు ఉత్తర్వులను అబేయన్స్‌లో ఉంచినట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం పాత నిబంధనల ప్రకారం 20 శాతం ఫ్రీ సీట్ల విధానమే కొనసాగనుంది.

  • ప్రయాణికులకు ఊరటపై కేంద్రం యూటర్న్
  • ఎయిర్‌లైన్స్ ఒత్తిడికి తలొగ్గిన మంత్రిత్వ శాఖ
  • 60% నుంచి మళ్లీ 20% ఫ్రీ సీట్లకే పరిమితం
  • టికెట్ ధరల సమతుల్యతే కారణమా?
  • సమీక్ష తర్వాతే తుది నిర్ణయం

న్యూస్ డెస్క్ | పెన్ పవర్ | ఏప్రిల్ 03:

విమాన ప్రయాణికులకు అదనపు ఛార్జీల భారం తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఉచితంగా ఎంపిక చేసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం అమల్లోకి రావడానికి ముందే, ఎయిర్‌లైన్స్ సంస్థల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. సీటు ఎంపిక ఫీజులు ఎయిర్‌లైన్స్‌కు కీలకమైన అదనపు ఆదాయ వనరుగా ఉండటంతో, 60 శాతం సీట్లను ఉచితంగా ఇస్తే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని సంస్థలు ప్రభుత్వానికి వివరించాయి. నిర్వహణ ఖర్చులు, ఇంధన భారం పెరుగుతున్న సమయంలో ఈ నిబంధన టికెట్ ధరలను మరింత పెంచే పరిస్థితి తీసుకువస్తుందని వారు వాదించారు. ఈ విన్నపాలను పరిశీలించిన కేంద్రం, పూర్తి స్థాయి సమీక్ష పూర్తయ్యే వరకు ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం పాత నిబంధనల ప్రకారం విమానాల్లో కేవలం 20 శాతం సీట్లు మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉండనున్నాయి. మిగతా సీట్లకు ఎయిర్‌లైన్స్ నిర్ణయించిన అదనపు ఛార్జీలు ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులు ఒకే PNRలో ఉంటే పక్కపక్కనే సీట్లు కేటాయించడం వంటి ఇతర ప్రయాణికుల సౌకర్య నిబంధనలు మాత్రం కొనసాగనున్నాయి.