నెలిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి, స్థానిక టీడీపీ నేతల మధ్య విభేదాలు తీవ్రం అవుతున్నాయి. కాంట్రాక్టులు, నామినేటెడ్ పోస్టులు, కార్యక్రమాల్లో ప్రాధాన్యంపై అసంతృప్తి పెరిగింది. తమను పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నేతలు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశారు. మరోవైపు తనపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. కూటమి పార్టీల మధ్య ఈ గ్యాప్ స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
- లోకం మాధవి–టీడీపీ నేతల మధ్య పెరుగుతున్న గ్యాప్
- కాంట్రాక్టులు, పోస్టులపై టీడీపీ నేతల అసంతృప్తి
- కార్యక్రమాలకు ఆహ్వానం లేదన్న స్థానిక నాయకత్వం
- ఎమ్మెల్యే ఏకపక్ష ధోరణి ఆరోపణలు
- పెత్తనం చేస్తున్నారంటూ మాధవి వర్గం కౌంటర్
- కూటమి హైకమాండ్ జోక్యం అవసరమన్న చర్చబ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ , విజయనగరం ఏప్రిల్ 7:
విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు బహిరంగ చర్చకు దారితీశాయి. జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మరియు స్థానిక టీడీపీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేన గెలుచుకోగా, ఇప్పుడు స్థానికంగా టీడీపీ వర్గంలో అసంతృప్తి పెరుగుతోంది. టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ ఏమిటంటే, కాంట్రాక్టు పనులు, నామినేటెడ్ పోస్టులు, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాల్లో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని. గత ఎన్నికల్లో తాము కష్టపడి గెలిపించిన తర్వాత ఇప్పుడు పట్టించుకోకపోవడం సరైంది కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కార్యక్రమాలకు ఆహ్వానాలు లేకపోవడం, నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడం వల్ల స్థానిక కేడర్‌లో అసహనం పెరిగింది. మరోవైపు ఎమ్మెల్యే లోకం మాధవి వర్గం మాత్రం స్థానిక టీడీపీ నేతలు నియోజకవర్గంలో పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులతో నేరుగా మాట్లాడి పనులు చక్కబెడుతున్నారని ఆరోపిస్తోంది. తనకు సమాచారం ఇవ్వకుండా కొన్ని వ్యవహారాలు సాగుతున్నాయని ఎమ్మెల్యే వర్గం వాదిస్తోంది. ఈ విభేదాల కారణంగా ఎమ్మెల్యే హాజరయ్యే సమావేశాలకు టీడీపీ నేతలు దూరంగా ఉండటం గమనార్హం. దీంతో నెలిమర్లలో కూటమి పార్టీల మధ్య సమన్వయం లోపం మరింత స్పష్టమవుతోంది. ఇరు పార్టీల రాష్ట్ర నాయకత్వం త్వరగా జోక్యం చేసుకోకపోతే ఈ విభేదాలు స్థానిక రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.