1995- 2014 పాలనతో పోలికలు
పెట్రోలు, డీజిల్ కొరతపై స్పందన లోపం
రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ప్రశ్నలు
సమీక్షలు.. కానీ చర్యలు ఎక్కడ?
అధికారుల అలుసే కారణమా?
నాటి ‘నిప్పు’ లాంటి చంద్రబాబు ఏరీ?
పాలనపై పట్టు సడలుతోందా?
అధికారుల ఉదాసీనతపై కార్యకర్తల ఆవేదన!
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విజయవాడ, ఏప్రిల్ 29:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘చంద్రబాబు నాయుడు’ అంటే ఒక బ్రాండ్. క్రమశిక్షణకు మారుపేరు, అధికారుల గుండెల్లో సింహస్వప్నం. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. మనం చూస్తున్నది పాత చంద్రబాబునేనా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి అవలంబిస్తున్న ‘మెతక వైఖరి’ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
95 నాటి పౌరుషం ఏది? : తాను అధికారంలోకి రాగానే 1995 నాటి ఆవేశాన్ని, పాలనా దక్షతను చూపిస్తానని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. 95 నాటి వేగం మాట దేవుడెరుగు.. కనీసం 2014లో ఉన్నపాటి కఠినత్వం కూడా ఇప్పుడు కనిపించడం లేదని సొంత పార్టీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు. సమీక్షా సమావేశాలు కేవలం ఫోటో షూట్‌లకు, ఉపన్యాసాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
చమురు సెగ.. అధికారుల అలుసు : గత వారం రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. సామాన్యులు బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తుంటే, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ సమస్య ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లే వరకు యంత్రాంగం నిద్రపోవడం, తెలిసిన తర్వాత కూడా సీఎం వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. గతంలో ఇటువంటి వైఫల్యాలు ఎదురైతే అధికారుల తాట తీసే చంద్రబాబు, ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
రియల్ టైమ్ గవర్నెన్స్.. అలంకారప్రాయమేనా? : సాంకేతికతను పాలనలో వాడుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ ద్వారా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో తెలుసుకునే వ్యవస్థ ఉందని చెబుతుంటారు. మరి ఇంతపెద్ద చమురు సంక్షోభం రాష్ట్రంలో నెలకొంటే, రియల్ టైమ్ గవర్నెన్స్ ఏం చేస్తోంది? అధికారుల ఉదాసీనతను ఈ వ్యవస్థ ఎందుకు పసిగట్టలేకపోయింది? ఒకవేళ సమాచారం ఉన్నా, నాయుడు ఎందుకు పెదవి విప్పడం లేదు? అన్న ప్రశ్నలు మేధావులను సైతం ఆలోచింపజేస్తున్నాయి.

కలెక్టర్ల కాన్ఫరెన్స్.. విజన్ వర్సెస్ రియాలిటీ : ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే కలెక్టర్ల సమావేశాలు ఇప్పుడు కేవలం ‘జ్ఞానబోధ’ తరగతులుగా మారిపోయాయనే ఆరోపణలు వస్తున్నాయి. తన విజన్ గురించి, గత అనుభవాల గురించి వివరించడానికే సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలను ఎండగట్టడం లేదు. తప్పు చేసిన అధికారులకు హెచ్చరికలు జారీ చేయకపోవడం వల్లనే, పాలనా యంత్రాంగంలో బాధ్యతారాహిత్యం పెరిగిపోయిందనేది బహిరంగ రహస్యం.
కార్యకర్తల ఆవేదన.. బాబు మారేనా? : పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఇప్పుడు అధికారుల దగ్గర గౌరవం దక్కడం లేదనే అసంతృప్తి నెలకొంది. నాయకుడు కఠినంగా ఉంటేనే యంత్రాంగం దారికి వస్తుందని వారు నమ్ముతున్నారు. 2024 తర్వాత చంద్రబాబులో కనిపిస్తున్న ఈ అసాధారణ మార్పు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందేమోనన్న భయం వారిలో ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు తన పాత శైలిని పుణికిపుచ్చుకుని, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచాలని ప్రజలు కోరుకుంటున్నారు.