PEN POWER
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 1:57 pm Posted By : PEN POWER MEDIA

కొత్త ఈసీగా అనిల్ చంద్ర పునేఠా ?

ఎస్‌ఈసీ పదవికి పునేఠా పేరు ముందంజలో
గవర్నర్ ఆమోదంతో త్వరలో నియామకం
సీఎస్‌గా పనిచేసిన అనుభవం కీలకం
విజిలెన్స్ కమిషనర్‌గా మరో బాధ్యత మార్పు?
నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన తర్వాత ఖాళీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా (ఎస్‌ఈసీ) కొత్త నియామకంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్‌తో నియామక ప్రక్రియ తుది దశకు చేరినట్టు తెలుస్తోంది.

స్టేట్ బ్యూరో పెన్ పవర్ విజయవాడ, ఏప్రిల్ 17:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) పదవికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆమోదం తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ప్రస్తుతం ఈ పదవి ఖాళీగా ఉంది. గత ఎస్‌ఈసీ నీలం సాహ్ని పదవీకాలం మార్చి నెలాఖరుతో ముగియడంతో, కొత్త నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పరిపాలనా అనుభవం ఉన్న పునేఠాను ఎంపిక చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.అనిల్ చంద్ర పునేఠా 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ఉత్తమ కలెక్టర్‌గా పలుమార్లు గుర్తింపు పొందారు.పునేఠా చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ పదవి నుంచి తొలగించబడ్డారు. ఆ తర్వాత ఆయన వివిధ కీలక పోస్టుల్లో సేవలందించారు. ప్రస్తుతం విజిలెన్స్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.ఇక ఆయనను ఎస్‌ఈసీగా నియమిస్తే, విజిలెన్స్ కమిషనర్ స్థానంలో మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నియామకం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల్లో ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి.