PEN POWER
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 12:19 pm Posted By : PEN POWER MEDIA

అమరావతిలో లెక్క తప్పిన వైసీపీ

అమరావతికి శాశ్వత రాజధాని హోదా కల్పించే బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వేళ రాజకీయంగా కూటమి పైచేయి సాధించింది. అన్ని పార్టీలు మద్దతుగా నిలిచిన సమయంలో వైసీపీ స్పష్టమైన వైఖరి చూపలేక విమర్శలకు గురైంది.లోక్‌సభ, రాజ్యసభల్లో మద్దతు వెల్లువ మధ్య వైసీపీ వాక్‌అవుట్ చేయడం చర్చనీయాంశమైంది.అమరావతి రైతుల భావోద్వేగాన్ని టీడీపీ సమర్థంగా క్యాష్ చేసుకోగా, వైసీపీ కన్ఫ్యూజన్ స్టాండ్ సెల్ఫ్‌గోల్‌గా మారింది.రాజధాని రాజకీయాల్లో మరోసారి “జై అమరావతి” నినాదమే హాట్ అజెండాగా నిలిచింది.

  • పార్లమెంట్‌లో అమరావతికి జై.. వైసీపీకి కన్ఫ్యూజన్ షాక్
  • బిల్లుకు దేశవ్యాప్తంగా మద్దతు, వైసీపీ వాక్‌అవుట్
  • రైతుల ఎమోషన్‌ను క్యారీ చేసిన కూటమి వ్యూహం
  • మూడు రాజధానుల స్టాండ్‌పై ఇంకా క్లారిటీ లేని వైసీపీ
  • అమరావతి సెంటిమెంట్‌తో టీడీపీకి రాజకీయ అడ్వాంటేజ్

విజయవాడ | పెన్ పవర్ | ఏప్రిల్ 3:

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించే బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో రాష్ట్ర రాజకీయాల్లో కూటమి పార్టీలు స్పష్టమైన ఆధిపత్యం చూపించాయి. ముఖ్యంగా అమరావతి రైతుల భావోద్వేగాన్ని, ప్రాంతీయ సెంటిమెంట్‌ను సమర్థంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో టీడీపీ విజయవంతమైంది.లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్డీఏతో పాటు పలువురు విపక్ష పార్టీలు కూడా బిల్లుకు మద్దతు ఇవ్వగా, వైసీపీ మాత్రం బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాక్‌అవుట్ చేసింది. ఈ వైఖరి ఆ పార్టీపై మరింత విమర్శలకు దారితీసింది.2019 ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు తెలిపిన వైసీపీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నినాదాన్ని ముందుకు తెచ్చింది. అయితే ఆ విధానాన్ని ప్రజల్లో బలంగా నమ్మించలేకపోవడం, రైతుల ఆందోళనలను సమర్థంగా హ్యాండిల్ చేయకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఇక కూటమి ప్రభుత్వం మాత్రం అమరావతి రైతుల త్యాగాలను జాతీయ వేదికపై ప్రస్తావిస్తూ “జై అమరావతి” భావోద్వేగాన్ని దేశవ్యాప్తంగా వినిపించేలా చేసింది. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం తర్వాత రైతుల్లో సంబరాలు వెల్లువెత్తడం, కూటమి నేతలు దీనిని చారిత్రక విజయంగా ప్రచారం చేయడం రాజకీయంగా వారికి బూస్ట్ ఇచ్చింది.