ప్రోటోకాల్ లోపాలపై పోలవరం జిల్లా సమీక్ష సమావేశం వాయిదా
రంపచోడవరం, పెన్ పవర్, మే 31 :
పోలవరం జిల్లాలో నిర్వహించాల్సిన రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్.టి.) కమిషన్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ప్రోటోకాల్ లోపాలు, అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా వాయిదా పడింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ బొజ్జి రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.శనివారం నిర్వహించాల్సిన సమీక్ష సమావేశానికి సంబంధించి ముందుగానే షెడ్యూల్, సమాచారం సంబంధిత శాఖల అధికారులకు అందజేసినప్పటికీ, జిల్లా స్థాయి అధికారులు, ప్రోటోకాల్ అధికారులు తగిన విధంగా స్పందించకపోవడం, సమావేశానికి సమయానికి హాజరు కాకపోవడం పట్ల చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లాలో రాష్ట్ర ఎస్.టి. కమిషన్‌కు తగిన గౌరవం, ప్రోటోకాల్ కల్పించకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు శాఖ తరఫున సరైన ప్రోటోకాల్ ఏర్పాట్లు లేకపోవడం, విధుల్లో ఉన్న సిబ్బంది యూనిఫాంలో లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ సంబంధిత అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల సమస్యలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఆర్ అండ్ ఆర్ అధికారులు గానీ ఐటీడీఏ అధికారులు గానీ హాజరు కాకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినప్పటికీ 12 గంటల వరకు అధికారులు హాజరు కాకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.ఐటీడీఏ సమావేశ మందిరంలో పరిస్థితులపై అసహనం వ్యక్తం చేసిన చైర్మన్ బొజ్జి రెడ్డి, “గిరిజన ప్రజాప్రతినిధులకే తగిన గౌరవం ఇవ్వని పరిస్థితిలో గిరిజనాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది” అంటూ ప్రశ్నించారు. అనంతరం సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చి తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గతంలో కూడా ఒక కార్యక్రమంలో తనకు తగిన ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారని చైర్మన్ గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ ముఖ్య కార్యదర్శితో సమావేశంలో ఉన్న కారణంగా మరో పది నిమిషాల్లో సమీక్ష సమావేశానికి హాజరవుతానని సమాచారం ఇచ్చినప్పటికీ, ఇతర జిల్లా స్థాయి అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా సమావేశ నిర్వహణలో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్పందించినప్పటికీ, మిగిలిన శాఖల అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందని చైర్మన్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలవరం జిల్లా సమీక్ష సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.భవిష్యత్తులో రాష్ట్ర ఎస్.టి. కమిషన్ నిర్వహించే కార్యక్రమాలకు అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి, ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ కమిషన్‌కు తగిన గౌరవం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ ఘటన జిల్లాలో అధికార యంత్రాంగం పనితీరుపై చర్చకు దారితీసింది. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రోటోకాల్ ఉల్లంఘన పై పలు ఆదివాసి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. క్యాబినెట్ హోదా కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గిరిజన ప్రజా ప్రతినిధి పట్ల అధికారుల తీరు సమంజసంగా లేదని వారు ఆరోపించారు.