PEN POWER
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 7:51 pm Posted By : A YESOBU

అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం… ఈ

ఐటివరంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం

రాష్ట్రంలో రెండేళ్లలో 200 సబ్‌స్టేషన్లు పూర్తి

ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి రూ.32 కోట్లతో 2260 సోలార్ కనెక్షన్లు

త్వరలో ఏఈలు, లైన్‌మెన్ పోస్టుల భర్తీ

మంత్రి గొట్టిపాటి రవికుమార్

పుల్లల చెరువు, పెన్ పవర్ మే 21

రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా 200 విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. పుల్లల చెరువు మండలం ఐటివరం గ్రామంలో రూ.3.80 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ ఎం. విజయసునీత, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తమల అశోక్‌రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న లోవోల్టేజ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.కొత్త సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుల అవసరాలను గుర్తించి ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.పీఎం సూర్య ఘర్ పథకం కింద ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రూ.32 కోట్ల వ్యయంతో 2260 సోలార్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు విద్యుత్ భారం తగ్గడమే కాకుండా స్వయం విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కలుగుతుందన్నారు.పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ పొదుపుకూ ఈ పథకం దోహదపడుతుందని వివరించారు.
విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న సిబ్బంది సమస్యను కూడా ప్రభుత్వం గుర్తించిందని, త్వరలోనే ఏఈలు, లైన్‌మెన్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యుత్ శాఖను సాంకేతికంగా మరింత బలోపేతం చేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని పేర్కొన్నారు.వెలిగొండ ప్రాజెక్టు పనులను కూడా ప్రభుత్వం వేగవంతం చేసిందని, త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.అంతకుముందు దోర్నాల మండలం చినగుడిపాడు గ్రామంలో పీఎం సూర్య ఘర్ సోలార్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, డీఈ నాగేశ్వరరావు, పుల్లల చెరువు టీడీపీ మండల కన్వీనర్ పోట్ల గోవింద్, మాజీ మండల కన్వీనర్ పయ్యావుల ప్రసాద్, రెంటపల్లి సుబ్బారెడ్డి, కాకర్ల కోటయ్యతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.