PEN POWER
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 12:58 pm Posted By : D Ratnam

ఎల్‌నినో ప్రభావంతో పోలవరం జిల్లాలో వర్షపాతం లోటు

అత్యవసర సమాచారం కోసం జిల్లా కంట్రోల్ రూం ఏర్పాటు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ కె. దినేష్ కుమార్

రంపచోడవరం, మే 21 (పెన్ పవర్):
ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు మరియు అధిక ఉష్ణోగ్రతల కారణంగా పోలవరం జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే గణనీయంగా తక్కువ వర్షపాతం నమోదవుతోందని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు 7702831559 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

మే 1 నుంచి 20వ తేదీ వరకు నమోదైన వర్షపాతం గణాంకాల ప్రకారం జిల్లాలో సాధారణంగా నమోదవాల్సిన 889.6 మి.మీ. వర్షపాతానికి గాను కేవలం 497 మి.మీ. మాత్రమే నమోదై, సగటున 44.1 శాతం లోటు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా సగటు ప్రకారం 74.1 మి.మీ. వర్షపాతం ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 41.4 మి.మీ. మాత్రమే నమోదైంది.

కూనవరం, చింతూరు, వీఆర్ పురం, వై.రామవరం, గంగవరం, గుర్తేడు మండలాల్లో తీవ్ర వర్షపాతం లోటుతో “స్వల్ప వర్షపాతం (Scanty)” పరిస్థితులు నమోదయ్యాయి. ముఖ్యంగా వీఆర్ పురం మండలంలో 98.2 శాతం వర్షపాతం లోటు నమోదైంది. మారేడుమిల్లి, రాజవొమ్మంగి, ఏటపాక మండలాల్లో “వర్షపాతం లోటు (Deficient)” పరిస్థితులు ఉండగా, దేవీపట్నం మరియు అడ్డతీగల మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రంపచోడవరం మండలంలో మాత్రం సాధారణ కంటే 23.6 శాతం అధిక వర్షపాతం నమోదై “అధిక వర్షపాతం (Excess)” కేటగిరీలో నిలిచింది.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మధ్యాహ్న వేళల్లో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తగినంత తాగునీరు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

వ్యవసాయ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులు గ్రామస్థాయిలో అప్రమత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.