- “మహాప్రభో… తాగేందుకు నీళ్లు ఇప్పించండి” అంటూ గ్రామస్తుల వేడికోలు
- ఎండలు మండుతున్నా స్పందించని అధికారులు.. కలుషిత నీటితోనే దాహార్తి తీర్చుకుంటున్న మహిళలు
- ప్రత్యేక కథనం
బైలైన్: దడాల ఏడుకొండలు – పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్, కాకినాడ జిల్లా
కాజులూరు, మే 21 (పెన్ పవర్):
ఒకవైపు భానుడు భగభగమంటూ మండిపోతుంటే… మరోవైపు గుక్కెడు మంచినీటి కోసం కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఒంటితాడి, శీలలంక గ్రామాల ప్రజలు కటకటలాడుతున్నారు. రక్షిత మంచినీటి పథకం ఉన్నా, పైపులు ఉన్నా, అధికారులు ఉన్నా… గ్రామస్తుల దాహార్తి మాత్రం తీరడం లేదు. “మాకు ఇళ్లు వద్దు… ఆస్తులు వద్దు… తాగేందుకు మంచినీళ్లు ఇప్పించండి మహాప్రభో” అంటూ మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు.గొల్లపాలెం రక్షిత మంచినీటి పథకం ద్వారా మండలంలోని 24 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, ఒంటితాడి గ్రామపంచాయతీ పరిధిలోని ఒంటితాడి, శీలలంక గ్రామాలకు మాత్రం వారంరోజులుగా సరైన నీటి సరఫరా జరగడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు మండల అధికారులకు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దృష్టికి సమస్య తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం కనిపించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
“చెరువు నీళ్లే మా దిక్కు”
తాగునీరు అందకపోవడంతో సమీపంలోని పశువుల చెరువులోని నీటినే తాగునీటిగా వినియోగిస్తున్నామని మహిళలు వాపోతున్నారు. “కలుషిత నీరు తాగొద్దని అధికారులు చెబుతారు… కానీ మా గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసే వారు ఎవరూ లేరు” అంటూ మండిపడుతున్నారు. వేసవి ప్రతి ఏడాది వస్తున్నా, సమస్య మాత్రం శాశ్వతంగా మారిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 47;అధికారుల నిర్లక్ష్యమా.. వ్యవస్థ వైఫల్యమా?
గ్రామంలో తాగునీటి సమస్య ఉందని ఆర్డబ్ల్యూఎస్ జేఈ రూపా స్వయంగా అంగీకరించారు. పైపుల లీకేజీలు, పంపింగ్ సమస్యల కారణంగా పూర్తిస్థాయిలో నీరు అందించలేకపోతున్నామని ఆమె తెలిపారు. అయితే సమస్య తెలిసినా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు చేపట్టలేదన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం లేదు. 
ప్రత్యేక అధికారి సత్యనారాయణమూర్తిని సమస్యపై ప్రశ్నించగా “ప్రయత్నిస్తున్నాం” అనే సమాధానంతో సరిపెట్టారని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాక “ఈ సమస్యపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడగండి” అంటూ బాధ్యతను మరో శాఖపై నెట్టివేసినట్లు సమాచారం.
గ్రామపంచాయతీ కార్యదర్శి శృతి మాత్రం “కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం కసరత్తు చేస్తున్నాం” అని చెప్పడం విశేషం. అయితే మండుతున్న ఎండల్లో ప్రజలకు ఇప్పటికీ గుక్కెడు మంచినీరు అందకపోవడం అధికార యంత్రాంగ పనితీరుపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఔట్సోర్సింగ్ ఉద్యోగిపై ఆరోపణలు
ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఏడిద నాయుడు చెప్పిందే అధికారులు చేస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏ గ్రామానికి నీరు ఇవ్వాలన్నా ఆయన సూచనల మేరకే వ్యవహారం సాగుతోందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. గతంలో కూడా ఆయనపై ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
“ఇంకా రెండు రోజులు చూస్తాం… లేకపోతే కలెక్టర్ వద్దకు”
తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని గ్రామ మహిళలు హెచ్చరిస్తున్నారు. “ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది… కానీ అధికారులు మాత్రం కాగితాలపైనే చర్యలు చూపిస్తున్నారు” అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒంటితాడి ఘటనతో బయటపడిన గ్రామీణ వాస్తవం
ప్రభుత్వాలు మారుతున్నా, హామీలు మారుతున్నా… గ్రామాల్లో తాగునీటి సమస్య మాత్రం యథాతథంగా కొనసాగుతోందని ఒంటితాడి గ్రామం మరోసారి నిరూపిస్తోంది. ప్రజలు దాహంతో అలమటిస్తుంటే అధికారులు శాఖల మధ్య బాధ్యతలు తోసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఒంటితాడి, శీలలంక గ్రామాల ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.