రాష్ట్ర ఆదివాసీ హక్కుల వేదిక డిమాండ్
గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 12: నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాలో జిల్లా ప్రధాన కేంద్రంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆదివాసీ హక్కుల వేదిక అధ్యక్షుడు బోండ్ల వర ప్రసాద్ రావు జిల్లా కలెక్టర్‌ను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అప్పటి ప్రాజెక్టు అధికారి మ్యూజియం ఏర్పాటు కోసం స్థలాన్ని కూడా కేటాయించినట్లు తెలిపారు. జిల్లా హెడ్‌క్వార్టర్‌లో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయడం ద్వారా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రకు ప్రాధాన్యం లభిస్తుందని పేర్కొన్నారు.గత పది సంవత్సరాల క్రితమే మ్యూజియం కోసం అనేక గిరిజన సాంప్రదాయ వస్తువులు సేకరించి పిఎంఆర్సి లో భద్రపరిచినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే సేకరించిన ఆ వస్తువులను వినియోగించి వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.జిల్లాలోని గిరిజన వారసత్వాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.