చింతూరు, పెన్ పవర్, మే 21:
మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతుగూడెం పంచాయతీకి చెందిన పొల్లూరు జలపాతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం లోని గైడ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఐదుగురు స్నేహితులు విహార యాత్ర నిమిత్తం పొల్లూరు జలపాత ప్రాంతానికి వచ్చారు. ఈ సందర్భంగా వారిలో ఒకరైన ఎం. మోజెస్ (21), స్వస్థలం భద్రాచలం, తెలంగాణ రాష్ట్రం, ప్రమాదవశాత్తు జలపాతంలోని నీటిలో మునిగి మృతి చెందినట్లు మోతుగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ నస్సిర్ హుసైన్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.