చింతూరు, పెన్ పవర్, మే 18:
పోలవరం బహుళ ప్రయోజన సేద్యపునీటి ప్రాజెక్టు ఫేజ్–1బి పరిధిలో ప్రభావితమవుతున్న చింతూరు గ్రామ గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలకు తాడువాయి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్లాట్ల కేటాయింపునకు ఈ నెల 21న లాటరీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఐటిడిఏ చింతూరు ప్రాజెక్టు అధికారి తెలిపారు. చింతూరు మండలంలోని చింతూరు గ్రామ ప్రజలకు సమగ్ర పునరావాసం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో అభివృద్ధి చేస్తున్న తాడువాయి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి లాటరీ కార్యక్రమాన్ని 21.05.2026 తేదీన ఉదయం 11 గంటలకు చింతూరులోని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చింతూరు గ్రామానికి సంబంధించిన పునరావాస ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన డ్రాఫ్ట్ స్కీమ్స్ 1, 2 ఆధారంగా గ్రామ ప్రజల నుంచి ఇప్పటికే ఆప్షన్ ఫారాలు స్వీకరించినట్లు తెలిపారు. ప్రజలు తమ అవసరాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత అభిరుచులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిర్మాణ గృహాలు లేదా స్వీయ నిర్మాణ గృహాల ఎంపికలను నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఈ లాటరీ కార్యక్రమం ద్వారా తాడువాయి ఆర్ అండ్ ఆర్ కాలనీలో బ్లాకుల వారీగా ఎన్ని ప్రభుత్వ గృహాలు, ఎన్ని స్వీయ నిర్మాణ ప్లాట్లు అవసరమవుతాయనే అంశాలపై స్పష్టత తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం తుది కేటాయింపులు నిర్ణయించలేదని, ప్రజల నుంచి స్వీకరించిన ఆప్షన్ ఫారాల ఆధారంగా అవసరాల అంచనా, వర్గీకరణ, ప్రణాళిక ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జి.ఓలోని 3వ షెడ్యూల్ ప్రకారం ఆర్ అండ్ ఆర్ కాలనీలో కల్పించనున్న మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాల వివరాలను కూడా ప్రజలకు తెలియజేయనున్నట్లు వివరించారు. తాగునీరు, సీసీ రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, వీధి దీపాలు, పాఠశాలలు, ఆంగన్‌వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాల్, ఆరోగ్య కేంద్రం, ప్రార్థనా స్థలాలు, మార్కెట్ ప్రదేశాలు తదితర సౌకర్యాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. లాటరీ ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ, ఆర్ అండ్ ఆర్, ఇంజనీరింగ్, ఐటిడిఏ శాఖల అధికారులు, నిర్వాసిత కుటుంబాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న కుటుంబాలకు అన్ని మౌలిక వసతులతో కూడిన సమగ్ర పునరావాస కాలనీని అందించడం ప్రభుత్వ లక్ష్యమని ప్రాజెక్టు అధికారి పేర్కొన్నారు. చింతూరు గ్రామ ప్రజలు తప్పనిసరిగా లాటరీ కార్యక్రమానికి హాజరై అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.