ఎమ్మెల్యే శిరీషాదేవి
గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, మే 29:
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు. శుక్రవారం రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డలోని ఆమె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.అర్జీదారుల వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించి నివేదిక అందించాలని ఆదేశించారు. ముఖ్యంగా మండలంలోని విద్యుత్ సమస్యలు, తాగునీటి సరఫరా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పలు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన వినతులపై స్పందిస్తూ ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టిస్తామని హామీ ఇచ్చారు.వేసవి తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. ప్రజా దర్బార్ లక్ష్యాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమానికి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ప్రజలు ప్రజా దర్బార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్, మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ లోతా లక్ష్మణరావు, జెట్టి మధు, బూత్ ఇన్‌చార్జి పెద్దాడ నూకరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.