PEN POWER
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 6:37 pm Posted By : D Ratnam

బాలబాలికల సమగ్ర అభివృద్ధికి ‘కిషోరి వికాసం’ కార్యక్రమం

జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్

గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్ మే 4:
పోలవరం జిల్లాలో బాలబాలికల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా “కిషోరి వికాసం” కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కిషోరి వికాసానికి సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాలబాలికల శారీరక, మానసిక మరియు సామాజిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మే 5 నుంచి జూన్ 9 వరకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా 11 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలబాలికల ఆరోగ్యం, పోషణ, విద్య, మరియు స్వయం నైపుణ్యాల అభివృద్ధి ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు.కిషోరి వికాసం ద్వారా బాలబాలికలకు పౌష్టికాహారం, ఆరోగ్య పరీక్షలు, రక్తహీనత నివారణ కోసం ఐరన్ మాత్రలు పంపిణీ, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన, జీవన నైపుణ్యాలపై శిక్షణ అందించబడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాలలు విడిచిన బాలబాలికలను తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకురావడం కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో అమలు చేస్తూ ప్రతి బాలబాలికకు ఆరోగ్యకరమైన జీవన శైలిపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. కిషోరి వికాసం ద్వారా బాలబాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పోలవరం జిల్లాలోని 12 మండలాల్లో ఈ కార్యక్రమం అమలవుతున్నందున, అందుబాటులో ఉన్న అవకాశాలను బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. అంబేద్కర్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కే. ఉమా, ఏపీఓ జనరల్ డి.ఎన్.వి రమణ, డీఎంహెచ్ఓ పి. సరిత, డీఆర్డీఏ పీడీ డాక్టర్ దాసరి రత్నాకర రావు, సీడీపీవోలు సుజాత, సుచరిత తదితరులు పాల్గొన్నారు.