సీతానగరం, పెన్ పవర్ మే 4:
రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల, రాజమండ్రి వారి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామంలోని కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తెలిపారు.శిబిరంలో డా. శ్రీనివాస్ రాయుడు, డా. సత్యం రమేష్ బాబు పాల్గొని సుమారు 200 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. వీరిలో 78 మందికి రక్త పరీక్షలు, 4 మందికి థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు.

అలాగే పరమహంస యోగానంద నేత్రాలయ, వేమగిరి సంస్థ ఆధ్వర్యంలో 48 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 7 మందిని శుక్లం (ముత్యబిందు) శస్త్రచికిత్స కోసం వేమగిరి ఆసుపత్రికి తరలించారు. మరో 11 మందికి కళ్లజోడ్లు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నేత్రాలయ ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన రోగులు, సహాయకులకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధి కుమారి జి. సుశీల, యాన్నమని వెంకటనారాయణ, రామకృష్ణ మిషన్ కోఆర్డినేటర్ కానుమూరు శ్రీనివాస్ తదితరులు, గిరిజన సంచార వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.