PEN POWER
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 9:08 pm Posted By : Sathish Bede

లక్కవరం ఘటనల నేపథ్యంలో పోలీసుల ప్రత్యేక సమావేశం

లక్కవరం గ్రామంలో శాంతి కమిటీ సమావేశం

మద్యం, గంజాయి, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఏ ఎస్ పి హేమంత్

చింతూరు, పెన్ పవర్, మే 19:

పోలవరం జిల్లా చింతూరు మండలం చదలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్కవరం గ్రామంలో మంగళవారం సాయంత్రం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అదనపు పోలీస్ సూపరింటెండెంట్ బి హేమంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏ ఎస్ పి హేమంత్ మాట్లాడుతూ, గతంలో గ్రామంలో చోటుచేసుకున్న హత్యలు, మద్యం మత్తులో తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయాల వల్ల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. అలాగే గంజాయి వినియోగం, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. చట్టాలను గౌరవిస్తూ గ్రామాల్లో శాంతియుత వాతావరణం కొనసాగించేందుకు పోలీసులకు సహకరించాలని గ్రామస్థులను కోరారు. ఈ సమావేశంలో సుమారు 150 మంది గ్రామస్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సి హెచ్ గోపాలకృష్ణ, మోతుగూడెం సబ్‌ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నస్సిర్ హుసైన్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.