PEN POWER
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 6:41 am Posted By : D Ratnam

వాడపాలెంలో కలకలం.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..

 

ఇంటిలోకి దూసుకెళ్లిన ధాన్యం ట్రాక్టర్

కొత్తపేట, పెన్ పవర్, మే16:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో శనివారం మధ్యాహ్నం తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నేరుగా ఓ ఇంటిలోకి దూసుకెళ్లడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.చెయ్యేరు ప్రాంతం నుంచి ఈతకోట రైస్‌మిల్లుకు ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ వాడపాలెం గ్రామానికి చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా రోడ్డుపక్కనున్న చెల్లిబోయిన వెంకటరమణ ఇంటి గోడను ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లింది.ఆ సమయంలో వెంకటరమణ కుటుంబ సభ్యులు ఇంటి పక్క గదిలో నిద్రిస్తున్నట్లు సమాచారం. ట్రాక్టర్ నేరుగా ఇంటి ప్రధాన భాగంలోకి దూసుకురావడంతో భారీ శబ్దం వినిపించగా, స్థానికులు పరుగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా భయానికి గురయ్యారు. కొన్ని క్షణాల తేడాతో పెద్ద విషాదం తప్పిందని వారు పేర్కొన్నారు.ప్రమాదంలో ఇంటి గోడలు, సామగ్రి దెబ్బతిన్నప్పటికీ, ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాకపోవడం దేవుడి దయగా స్థానికులు భావిస్తున్నారు. ట్రాక్టర్ ఇంట్లోకి దూసుకెళ్లిన దృశ్యాలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి.సమాచారం అందుకున్న స్థానికులు, గ్రామ పెద్దలు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.