PEN POWER
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 6:43 am Posted By : D Ratnam

శని జయంతి వేళ మందపల్లిలో భక్తుల వెల్లువ.. అసౌకర్యాలపై ఈవో వివరణ

 

భక్తుల సహనానికి కృతజ్ఞతలు: ఈ.వో డి.సురేష్ బాబు

కొత్తపేట, పెన్ పవర్, మే16:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శని జయంతి, శని అమావాస్య సందర్భంగా వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించేందుకు ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడంతో దేవస్థానం పరిసరాలు జనసంద్రమయ్యాయి.
ఈ సందర్భంగా భక్తులు ఎదుర్కొన్న అసౌకర్యాలపై దేవస్థానం సహాయ కమిషనర్ ,కార్యనిర్వహణాధికారి దారపురెడ్డి సురేష్ బాబు వివరణ ఇచ్చారు. శని జయంతి పర్వదినాన్ని దేవస్థానం చరిత్రలో తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారీగా భక్తులు రావడంతో తైలాభిషేకాల నిర్వహణలో కొంత ఇబ్బంది తలెత్తిందన్నారు.దేవస్థానం వెనుక భాగంలో సుమారు 1.07 సెంట్ల స్థలంలో రూ.3 కోట్ల వ్యయంతో తైలాభిషేక మండపం, రూ.1.20 కోట్లతో అన్నదాన భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నిర్మాణాల కారణంగా ప్రస్తుతం భక్తులు తైలాభిషేకాలు నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణం తప్ప ఇతర ప్రదేశం అందుబాటులోలేకపోయిందన్నారు. దీంతో వేలాదిమంది భక్తులు ఆలయంలోనే తైలాభిషేకాలు నిర్వహించడంతో రద్దీ మరింత పెరిగిందని చెప్పారు.అయితే భక్తులు కొంత అసహనానికి గురైనప్పటికీ, ధర్మకర్తల మండలి సభ్యులు, పోలీసు సిబ్బంది సహకారంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చామని ఈవో వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదం, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మందపల్లి పెద్ద బ్రిడ్జి, ఏనుగుల మహల్ చిన్న బ్రిడ్జి వద్ద మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందించామని పేర్కొన్నారు.భక్తుల సహనానికి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేసిన ఈవో, భవిష్యత్తులో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.