బాలారం, కంటారం, కించలి, బకులూరు గ్రామాల ఎయిర్టెల్ వినియోగదారుల ఆవేదన
కొయ్యూరు, పెన్ పవర్, మే 27:నెలరోజులు రీఛార్జ్ చేసుకున్నా 15 రోజులు కూడా సిగ్నల్ అందకపోవడంతో ఎయిర్టెల్ వినియోగదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. మండలంలోని బాలారం, కంటారం, కించలి, బకులూరు గ్రామాల్లో నెలల తరబడి ఎయిర్టెల్ సిగ్నల్ లేకపోవడంతో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ సిగ్నల్ లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంపై మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గాడి నాగమణి ఎయిర్టెల్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.నెలల తరబడి రీఛార్జ్‌లు చేయించుకున్నప్పటికీ, నెలలో కనీసం వారం రోజులు కూడా సరిగా సేవలు అందకపోవడం విచారకరమని ఆమె అన్నారు. అలాగే బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తోందని, దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామస్తులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.