PEN POWER
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 3:47 pm Posted By : D Ratnam

పోలవరం జిల్లా విద్యాశాఖ అధికారిగా జి. శ్రీరామ్ మూర్తి బాధ్యతల స్వీకారం

 

విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై ప్రత్యేక దృష్టి

గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 22:
పోలవరం (రంపచోడవరం) జిల్లా విద్యాశాఖ అధికారిగా జి. శ్రీరామ్ మూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రంపచోడవరం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఏజెన్సీ విద్యాశాఖ అధికారి వై మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన శ్రీరామ్ మూర్తి విద్యా రంగ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.అనంతరం జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బందితో సమావేశమైన ఆయన పరిపాలన, విద్యా కార్యక్రమాల అమలు, విద్యార్థుల హాజరు శాతం, బోధన నాణ్యత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏజెన్సీ విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి లక్ష్మీ శ్రీనివాసరావు, మారేడుమిల్లి మండల విద్యాశాఖ అధికారి నరసింహారావు, ఏఎంఓ ఈశ్వర్‌రావు, సీఎంఓ చిన్ని బాబు దొర, ఏపీఓ బొజ్జయ్య, సీఆర్‌పీలు, కార్యాలయ సిబ్బంది, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.