“
– సీడీపీఓ సుచరిత ఆదిలక్ష్మి
గంగవరం, పెన్ పవర్, మే 23 :
“ప్రతి బాలిక తన ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తుపై అవగాహన కలిగి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. బాల్య వివాహాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో జీవితాన్ని నిర్మించుకోవాలి” అని గంగవరం సీడీపీఓ సుచరిత ఆదిలక్ష్మి అన్నారు.గంగవరం ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించిన కిషోర్ వికాసం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సీత, ఎంఎస్‌కే సభ్యులు, కిషోర్ బాలికలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.డబ్బును సక్రమంగా వినియోగించడం, చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు పెంపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని వివరించారు. జీవితంలో లక్ష్యాలను నిర్దేశించుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు.అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై బాలికలకు అవగాహన కల్పిస్తూ, ఎలాంటి అనుచిత పరిస్థితులు ఎదురైనా భయపడకుండా పెద్దలకు తెలియజేయాలని సూచించారు. పిల్లల రక్షణ కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1098 గురించి వివరించి, అవసరమైన సమయంలో ఆ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.