PEN POWER
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 7:09 am Posted By : PEN POWER MEDIA

కావలి మున్సిపాలిటీలో అక్రమాల కలకలం

  • కావలి మున్సిపాలిటీ పనితీరుపై పెరుగుతున్న చర్చ
  • అక్రమ నిర్మాణాల నియంత్రణలో నిర్లక్ష్యం ఆరోపణలు
  • రెవెన్యూ విభాగం వ్యవహారశైలిపై ప్రజల్లో అసంతృప్తి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణలు
  • సమగ్ర విచారణకు ప్రతిపక్షాల డిమాండ్

కావలి మున్సిపాలిటీ పరిపాలనపై స్థానికంగా చర్చ కొనసాగుతోంది. అక్రమ కట్టడాలు, అనుమతుల ప్రక్రియలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ విభాగ పనితీరుపై ప్రజల్లో అనుమానాలు, వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా, స్థానిక మీడియాలో వచ్చిన ఆరోపణలపై స్పష్టత కోరుతున్నారు.  అవినీతి ఆరోపణలపై జిల్లా స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించాలని ప్రతిపక్షాల విజ్ఞప్తి చేస్తున్నారు.  పారదర్శక పరిపాలన అవసరమని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెన్ పవర్, కావలి, మే 10:

కావలి మున్సిపల్ కార్యాలయ పరిపాలనపై ఇటీవల రాజకీయ వర్గాలు, ప్రజల్లో చర్చ పెరుగుతోంది. ముఖ్యంగా రెవెన్యూ, అక్రమ నిర్మాణాలు, అనుమతుల ప్రక్రియల విషయంలో పారదర్శకత లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
స్థానిక వర్గాల కథనాల ప్రకారం, గ్రేడ్-1 మున్సిపాలిటీగా ఉన్న కావలిలో కొన్ని విభాగాల్లో అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అనుమతుల జారీ, అక్రమ కట్టడాల నియంత్రణ, రెవెన్యూ వ్యవహారాల్లో స్పష్టత లేకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
ఇటీవల సోషల్ మీడియా, స్థానిక మీడియాలో కొందరు అధికారుల వ్యవహార శైలిపై విమర్శలు వచ్చినప్పటికీ, వాటిపై స్పష్టమైన అధికారిక స్పందన లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు ఈ ఆరోపణలపై స్పందించి వాస్తవ పరిస్థితిని వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహిత పాలనపై పదేపదే దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, కావలి మున్సిపాలిటీలో వినిపిస్తున్న ఆరోపణలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక విచారణ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.