రెండో విడత రూ.8,097 కోట్లతో విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి
తొలి ప్యాకేజీ తరువాత మరో భారీ చేయూత
ఈక్విటీ రూపంలో నిధుల సమీకరణకు నిర్ణయం
మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు ఫుల్ స్వింగ్‌లో
క్యాబినెట్ ఆమోదం తర్వాత నిధుల విడుదల
కార్మికుల్లో పెరుగుతున్న ఆశలు
విశాఖ ఉక్కు పరిశ్రమను మళ్లీ లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారీ ప్యాకేజీతో ఊపిరి పోసిన కేంద్రం, ఇప్పుడు మరో విడత ఆర్థిక సహాయంతో ప్లాంట్‌కు దీర్ఘకాల భరోసా కల్పించేందుకు సిద్ధమైంది.
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, మే 5 :
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను పూర్వ వైభవానికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే గతేడాది ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీతో ప్లాంట్ కార్యకలాపాలకు ఊపిరి పోసిన కేంద్రం, ఇప్పుడు రెండో విడతగా రూ.8,097 కోట్ల ఆర్థిక చేయూతను అందించేందుకు సిద్ధమైంది.
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్‌ను క్లియర్ చేసి, ఆర్థికశాఖకు పంపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యయ విభాగం ఆమోదం లభించిన వెంటనే ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనుంది. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే నిధులు విడుదల కానున్నాయి.
ఇప్పటికే తొలి విడతలో రూ.11,440 కోట్ల ప్యాకేజీ ద్వారా ప్లాంట్‌ను గాడిలో పెట్టిన కేంద్రం, అదే విధానాన్ని కొనసాగిస్తూ రెండో విడత నిధులను కూడా ఈక్విటీ రూపంలోనే అందించాలని నిర్ణయించింది. గత ప్యాకేజీలో రూ.10,300 కోట్లు ఈక్విటీగా, మిగిలిన రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రుణాలుగా అందించగా, ఈసారి కూడా అదే నమూనాను అనుసరించనుంది.
ప్రస్తుతం ప్లాంట్‌లోని మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తుండటం గమనార్హం. దీంతో ఉక్కు ఉత్పత్తి పెరగడమే కాకుండా అమ్మకాలు కూడా గణనీయంగా మెరుగయ్యాయి. ప్లాంట్ తిరిగి స్థిరపడుతున్న ఈ కీలక దశలో రెండో విడత ఆర్థిక సాయం అందడం బలోపేతానికి దోహదం చేయనుంది.
ఇక రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం చర్చలు జరుపుతూ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ప్రైవేటీకరణ అంశంపై కొనసాగుతున్న చర్చలు, కార్మికుల ఆందోళనల మధ్య వరుసగా వస్తున్న ఈ ఆర్థిక ప్యాకేజీలు కార్మికుల్లోనూ, ప్రజల్లోనూ కొత్త ఆశలను నింపుతున్నాయి.
విశాఖ ఉక్కు పరిశ్రమ భవిష్యత్తు మరింత స్థిరంగా ఉండాలంటే ఈ నిధులు కీలక మలుపు తిప్పనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.