PEN POWER
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 7:21 am Posted By : PEN POWER MEDIA

ఆన్ డ్యూటీలోనే విందు మందు…

కావలి మున్సిపాలిటీపై అవినీతి మబ్బులు…

రెవెన్యూ విభాగం చుట్టూ తీవ్ర ఆరోపణలు
ఆన్ డ్యూటీలోనే విందు మందు…
మున్సిపాలిటీలో షాకింగ్ వాస్తవాలు

పెన్ పవర్ ప్రత్యేక కథనం

కావలి పట్టణంలో మున్సిపల్ పరిపాలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు సేవలందించాల్సిన అధికార వ్యవస్థలో అవినీతి, నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం పెరిగిపోతున్నాయనే ఆరోపణలు ప్రజల మధ్య విస్తృత చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కావలి మున్సిపాలిటీలో పరిపాలనపై ఇప్పటికే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో, ఇప్పుడు మరింత కలకలం రేపుతున్న అంశం బయటకు వస్తోంది. విధి నిర్వహణలో ఉండాల్సిన ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆన్ డ్యూటీలోనే మద్యం సేవిస్తూ అధికార బాధ్యతలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడన్న ఆరోపణలు పట్టణంలో హాట్ టాపిక్‌గా మారాయి.

 

అధికార దుర్వినియోగం – ప్రజల్లో ఆగ్రహం :
పట్టణ ప్రజల వాదన ప్రకారం, సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి కంటే మద్యం దుకాణాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నాడని ఆరోపిస్తున్నారు. ప్రజల పనులు చేయించుకోవాలంటే లంచాలు తప్పవని, ముఖ్యంగా ఇంటి పన్నులు, పేరు మార్పులు వంటి సేవల కోసం అధిక మొత్తంలో నగదు వసూళ్లు జరుగుతున్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు.

అవినీతి వ్యవస్థగా మారిన మున్సిపాలిటీ?:
కావలి మున్సిపాలిటీ ఒకవైపు స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాల్లో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ, మరోవైపు అవినీతి ఆరోపణలు తీవ్రంగా రావడం విరుద్ధ పరిస్థితిని సూచిస్తోంది. మున్సిపాలిటీలోని కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకుంటూ స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు.

పాత ఆరోపణలు – కొత్త సందేహాలు :
ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గతంలో మరుగుదొడ్ల నిర్మాణాల స్కామ్‌లో కూడా పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని సమాచారం. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సాక్షాలతో ప్రచారం జరిగినప్పటికీ, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పత్రికా ప్రతినిధిపై దాడి ఆరోపణ :
ఈ అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన ఓ పాత్రికేయుడిపై దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైనప్పటికీ, తదుపరి చర్యలపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

విధి వేళల్లోనే మద్యం మత్తు?
ప్రజల వాదన ప్రకారం, సంబంధిత అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉండాల్సిన సమయంలో తరచూ కనిపించకపోవడం, బదులుగా మద్యం దుకాణాల వద్ద సమయం గడుపుతున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి ఎదురు చూసినా, సంబంధిత అధికారి అందుబాటులో లేకపోవడం సాధారణమైందని పలువురు చెబుతున్నారు.

పనులకంటే ‘పానీయాల’కే ప్రాధాన్యం :
ఇంటి పన్నులు, పేరు మార్పులు వంటి ముఖ్య సేవల కోసం వచ్చిన ప్రజలు, అధికారిని కలవడానికి ప్రయత్నించినప్పుడు నిరాశతో వెనుదిరుగుతున్నారని సమాచారం. “పనుల కంటే మద్యం సేవకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు” అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రశ్నిస్తే బెదిరింపులా?
ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా ప్రశ్నిస్తే “నా వెనుక ఎమ్మెల్యే అండ ఉంది” అంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధమైన వ్యాఖ్యలు ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. “నాకు రాజకీయ అండ ఉంది” అంటూ ధీమాగా సమాధానం ఇస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విధమైన వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పరిపాలనపై మచ్చ :
ఒకవైపు స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రశంసలు అందుకున్న కావలి మున్సిపాలిటీ, మరోవైపు ఇలాంటి ఘటనలతో విమర్శలకు గురవుతోంది. “ఆన్ డ్యూటీలోనే విందు మందు” అనే చర్చ ఇప్పుడు పట్టణమంతా వ్యాపించి, మున్సిపల్ వ్యవస్థపై నమ్మకాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

ఏసీబీ ఎక్కడ?  :
ఈ స్థాయిలో ఆరోపణలు వస్తున్నప్పటికీ, అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. “ఎందుకు మౌనం?” అనే ప్రశ్న ఇప్పుడు కావలి ప్రజల నోట నలుగుతోంది.

ప్రజాప్రతినిధులు, పాత్రపై సందేహాలు :
ఈ అవినీతి వెనుక ఉన్న లావాదేవీలు, రాజకీయ అండ ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు తమ సమస్యలను పలుమార్లు చెప్పినా, సంబంధిత ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం పరిస్థితిని మరింత విషమం చేస్తోంది.

అధికారుల మౌనం ఎందుకు?
ఇంత తీవ్ర ఆరోపణలు వస్తున్నప్పటికీ, ఉన్నతాధికారులు స్పందించకపోవడం ప్రజల్లో అనుమానాలను పెంచుతోంది. సంబంధిత అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

విచారణ అవసరం – ప్రజా సంఘాల డిమాండ్
మున్సిపాలిటీలో జరుగుతున్న వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపితే పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగులోకి వస్తాయని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. నగదు లావాదేవీలు, అవినీతి పరిమాణం బయటపడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కొసమెరుపు:
కావలి మున్సిపాలిటీ పరిపాలనపై ప్రజల విశ్వాసం దెబ్బతింటున్న ఈ తరుణంలో, తక్షణమే పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే “బ్రష్టుపట్టిన మున్సిపాలిటీ” అనే ముద్ర మరింత బలపడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.