PEN POWER
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 6:51 pm Posted By : PEN POWER MEDIA

జలధార-జలహారతితో అక్కుమజ్జి చెరువుకు కొత్త జీవం

45 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భరోసా

రూ.9.87 లక్షలతో చెరువు అభివృద్ధి పనులు

20 రైతు కుటుంబాలకు ప్రత్యక్ష లాభం

90 మంది కూలీలకు గ్రామంలోనే ఉపాధి

చెరువు పునరుద్ధరణతో రైతుల్లో కొత్త ఆశలు

 

పెన్ పవర్, విశాఖపట్నం, మే 15 :


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “జలధార – జలహారతి” కార్యక్రమం గ్రామీణ వ్యవసాయానికి కొత్త ఊపిరి పోస్తోంది. ఇందులో భాగంగా పద్మనాభం మండలం శేరిఖండం పంచాయతీ పరిధిలోని అక్కుమజ్జి చెరువు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. చెరువుల పునరుద్ధరణ ద్వారా గ్రామీణ రైతాంగానికి సాగునీటి భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు స్థానిక రైతుల్లో నూతన ఆశలను నింపుతున్నాయి.

సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అక్కుమజ్జి చెరువు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9.87 లక్షలు కేటాయించింది. ఈ నిధులతో పూడికతీత, చెరువు గర్భం శుభ్రపరిచే పనులు, 120 మీటర్ల పొడవైన గట్టు బలోపేతం వంటి పనులు చేపడుతున్నారు. చెరువు పునరుద్ధరణతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, సుమారు 45 ఎకరాల ఆయకట్టు భూమికి సాగునీరు అందే పరిస్థితి ఏర్పడుతోంది.

ఈ చెరువు ఆధారంగా గ్రామ రైతులు వరి, రాగి, మొక్కజొన్న, కూరగాయలు, మినుములు వంటి పంటలను సాగు చేస్తున్నారు. గతంలో నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ప్రస్తుతం జరుగుతున్న పనులతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు నిండితే పంటల దిగుబడి మెరుగుపడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

అక్కుమజ్జి చెరువు అభివృద్ధి పనుల ద్వారా గ్రామంలో రోజువారీగా సుమారు 90 మంది కూలీలకు ఉపాధి లభిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ నిరుద్యోగులకు స్థానికంగానే పని దొరకడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువు అభివృద్ధితో దాదాపు 20 రైతు కుటుంబాలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నాయి.

ఈ సందర్భంగా రైతు రెడ్డిపల్లి సాయి మాట్లాడుతూ, “అక్కుమజ్జి చెరువే మా కుటుంబాలకు ఆధారం. చెరువు బాగుపడితే మా వ్యవసాయం బాగుపడుతుంది. ప్రభుత్వం చేపట్టిన పనులతో రైతులకు కొత్త ఆశలు కలిగాయి” అని తెలిపారు.

మరో రైతు తాడిశెట్టి సంతోషి మాట్లాడుతూ, “చెరువు నిండితే సాగునీటి సమస్య ఉండదు. తాగునీటి అవసరాలకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతోంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు భవిష్యత్తులో గ్రామానికి ఎంతో మేలు చేస్తాయి” అని ఆశాభావం వ్యక్తం చేశారు.