కాలువ కోతతో ప్రమాదంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం
దిమిలి గ్రామంలో ప్రమాద అంచున జాతీయ నాయకుడి విగ్రహం
కాలువ కోతతో ఆందోళనలో స్థానిక ప్రజలు
24 ఏళ్లుగా పెండింగ్‌లో ప్రొటెక్షన్ వాల్ ప్రతి జయంతికి వినతులే…
చర్యలు శూన్యం కరెంటు స్తంభం తొలగించాలని గ్రామస్తుల డిమాండ్
పెన్ పవర్ అనకాపల్లి, మే 18 :
స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికి, రాజకీయ చైతన్యానికి పేరుగాంచిన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో జాతీయ నాయకుడు, భారత మాజీ ఉప ప్రధాని, దళితుల ఆత్మగౌరవ ప్రతీక డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం ప్రస్తుతం రక్షణ లేక ప్రమాద అంచున నిలిచింది. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద కాలువ పక్కన ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి రక్షణ గోడ లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2002లో ఏర్పాటు చేసిన విగ్రహం
దిమిలి గ్రామ ప్రవేశంలో ఎడమవైపున ఉన్న కాలువ పక్కన 2002 సంవత్సరంలో అప్పటి దళిత నాయకులు మొయ్యేటి విజయ్ కుమార్, కొమ్ము సూర్యనారాయణ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి గ్రామ ప్రజలు ప్రతి ఏటా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
కాలువ నీటి ప్రవాహంతో కోత
విగ్రహం సమీపంలో నిరంతరం ప్రవహించే కాలువ నీటి ప్రభావంతో భూమి కోతకు గురవుతోంది. దీంతో విగ్రహం ఎప్పుడైనా కాలువలోకి ఒరిగిపోతుందేమోనన్న భయం స్థానికుల్లో నెలకొంది. రహదారికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో రక్షణ చర్యలు లేకపోవడం ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు.

ప్రతి ఏటా వినతులు… ఫలితం శూన్యం
ప్రతి సంవత్సరం జరిగే జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల సందర్భంగా గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పంచాయతీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రొటెక్షన్ వాల్ నిర్మించాలని విన్నవిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 24 సంవత్సరాలు గడిచినా సమస్య పరిష్కారం కాలేదని విమర్శిస్తున్నారు.
కరెంటు స్తంభం తొలగించాలని డిమాండ్
విగ్రహానికి ఎదురుగా అడ్డంగా కనిపించేలా ఏర్పాటు చేసిన కరెంటు స్తంభాన్ని కూడా పక్కకు మార్చాలని స్థానికులు కోరుతున్నారు. కాలువకు రక్షణ గోడ నిర్మిస్తే రహదారికి, విగ్రహానికి భద్రత కలుగుతుందని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
