విశాఖ సెంట్రల్ పార్క్‌లో ఫుడ్ కోర్ట్ నిర్మాణం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య విభేదాలు బహిరంగం కాగా… హైకోర్ట్ స్టేటస్ కో ఆదేశాలతో ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఫుడ్ కోర్ట్‌పై హైకోర్ట్ స్టే – ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ vs కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్
ఆరు కోట్ల ప్రాజెక్ట్‌కు అడ్డుకట్ట
పార్క్‌లో కమర్షియల్ నిర్మాణంపై వివాదం
న్యాయస్థానం కీలక ఆదేశాలు
జనసేనలో అంతర్గత పోరు బహిర్గతం
పాత వెండర్ల ఆందోళనలకు బలం
పెన్ పవర్ , విశాఖపట్నం మే 6:
విశాఖ నగరంలో అభివృద్ధి పేరుతో మరో రాజకీయ వివాదం తలెత్తింది. సెంట్రల్ పార్క్ వంటి ఊపిరితిత్తుల ప్రాంతంలో ఫుడ్ కోర్ట్ నిర్మాణం చేపట్టడం… ఒకవైపు అభివృద్ధి అంటూ ప్రచారం, మరోవైపు పర్యావరణం పేరుతో వ్యతిరేకత – ఇలా రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ వ్యవహారంలో ముఖ్యంగా ఒకే పార్టీకి చెందిన నేతల మధ్య విభేదాలు బయటపడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ వద్ద రూ.6 కోట్లతో ప్రతిపాదించిన ఫుడ్ కోర్ట్ నిర్మాణానికి హైకోర్ట్ బ్రేక్ వేసింది. స్టేటస్ కో విధిస్తూ నిర్మాణ పనులను నిలిపివేయాలని స్పష్టం చేసింది. గ్రీన్ జోన్‌గా ఉన్న పార్క్‌లో వాణిజ్య నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధమని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోర్టును ఆశ్రయించారు. పర్యావరణానికి ముప్పు కలుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం విచారణ జరిపి, వేసవి సెలవుల తర్వాత తదుపరి విచారణ వరకు పనులు చేపట్టవద్దని ఆదేశించింది. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, కలెక్టర్, మున్సిపల్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా, అదే పార్టీకి చెందిన కార్పొరేటర్ కోర్టు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే నైట్ ఫుడ్ కోర్ట్ తొలగింపు, కొత్త షాపుల కేటాయింపులపై విమర్శలు వస్తున్న వేళ… హైకోర్ట్ స్టే రావడం వెండర్లకు ఊరటనిచ్చింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని పట్టుదలగా ఉండగా… కార్పొరేటర్ మూర్తి యాదవ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. హైకోర్ట్ స్టేటస్ కో ఆదేశాలతో ప్రస్తుతం పనులు నిలిచిపోయినా… ఈ వివాదం ఇక్కడితో ముగిసేలా కనిపించడం లేదు. వేసవి సెలవుల అనంతరం కోర్టు విచారణలో తీసుకునే నిర్ణయం… ఈ ప్రాజెక్ట్ భవితవ్యాన్ని తేల్చనుంది. అప్పటి వరకు విశాఖలో ఎమ్మెల్యే vs కార్పొరేటర్ పోరు హాట్ టాపిక్‌గా మారనుంది.