PEN POWER
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 5:08 pm Posted By : YEDUKONDALU DADALA

అర్ధరాత్రి అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలిచిన మంత్రి సుభాష్

ద్రాక్షారామం, పెన్ పవర్ జూన్ 26: ద్రాక్షారామంలో గురువారం అర్ధరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదం పలువురు వ్యాపార కుటుంబాల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి సుమారు 20 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించగా, పలువురు వ్యాపారులు తమ జీవనాధారాన్ని కోల్పోయారు.ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అర్ధరాత్రి వేళలోనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నికి ఆహుతైన దుకాణాలను పరిశీలించిన మంత్రి, బాధిత వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆపద సమయంలో ప్రభుత్వం, తాను బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబాల బాధ నన్ను తీవ్రంగా కలచివేసింది. వారి కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటాను.

ప్రతి బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తాను. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు” అని అన్నారు.అలాగే సంబంధిత అధికారులతో మాట్లాడిన మంత్రి, జరిగిన నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి బాధితులకు వీలైనంత త్వరగా ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాద సమయంలో అప్రమత్తంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించిన అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులను అభినందించారు.
అర్ధరాత్రి సమయంలోనే తమ వద్దకు వచ్చి ఓదార్చి, ధైర్యం చెప్పిన మంత్రి సుభాష్‌కు బాధితులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచి భరోసా కల్పించిన ఈ మానవీయ స్పందనను జీవితాంతం మరిచిపోలేమని భావోద్వేగానికి గురయ్యారుఈ కార్యక్రమంలో స్థానిక కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.