PEN POWER
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 9:25 pm Posted By : YEDUKONDALU DADALA

ఆపదలో అండగా డేగల నాగేంద్ర.. అగ్నిప్రమాద బాధితులకు

కాజులూరు, పెన్ పవర్, జూన్ 26: ద్రాక్షారామంలో గురువారం అర్ధరాత్రి సంభవించిన ఘోర అగ్నిప్రమాదం పలువురు కూరగాయల వ్యాపారుల జీవితాల్లో విషాదాన్ని నింపింది. సుమారు 30 దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతై, లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడంతో పలువురు వ్యాపారులు ఒక్కసారిగా జీవనాధారాన్ని కోల్పోయారు.ఈ విషాద ఘటనపై స్పందించిన డీఎన్‌ఎఫ్ సంస్థ అధినేత, జనసేన పార్టీ యువనేత డేగల నాగేంద్ర బాధితులకు మానవీయ కోణంలో అండగా నిలిచారు.అగ్నిప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన వ్యాపారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ద్రాక్షారామ కూరగాయల మార్కెట్ పునర్నిర్మాణం కోసం తన వంతు సహాయంగా రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా డేగల నాగేంద్ర మాట్లాడుతూ, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. అగ్నిప్రమాదంతో జీవనోపాధిని కోల్పోయిన వ్యాపారులు త్వరగా కోలుకుని తిరిగి తమ వ్యాపారాలను ప్రారంభించే పరిస్థితులు ఏర్పడాలని ఆకాంక్షించారు. తన ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు కొంతైనా ఊరటనివ్వాలని, వారి జీవితాల్లో మళ్లీ ఆశలు చిగురించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ విపత్కర సమయంలో సమాజంలోని దాతలు,సేవాభావం కలిగిన వ్యక్తులు,స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి బాధిత కుటుంబాలకు చేయూతనివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కష్టకాలంలో అందరూ కలిసి నిలబడితేనే బాధితులు తిరిగి సాధారణ జీవితంలోకి రావడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
డేగల నాగేంద్ర ప్రకటించిన ఆర్థిక సహాయంపై బాధిత వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తూ,తమ కష్టాన్ని గుర్తించి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.