మత్తు వ్యసనాలపై విద్యార్థులకు అవగాహన
స్టాప్ రిపోర్టర్,చింతపల్లి/గూడెం కొత్త వీధి,పెన్ పవర్26: అంతర్జాతీయ డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని చింతపల్లి మండల కేంద్రంలోని జీటీడబ్ల్యూ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం అవగాహన సదస్సు, ప్రతిజ్ఞ, భారీ ర్యాలీ నిర్వహించారు.చింతపల్లి ఎక్సైజ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జ్ఞానేశ్వరి, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎన్. రాంబాబు నేతృత్వం వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎక్సైజ్ సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. “డ్రగ్స్ వద్దు – జీవనమే ముద్దు”, “మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం – సమాజాన్ని కాపాడుకుందాం” వంటి నినాదాలతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక వీధుల గుండా సాగి ప్రజల్లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించింది. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ ఎన్. రాంబాబు ప్రజలను కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎక్సైజ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.