కలుషిత ఆహారమే కారణమని ప్రాథమిక నిర్ధారణ,
32 మందికి చికిత్స
కాజులూరు, పెన్ పవర్, జూన్ 28: కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో నమోదైన డయేరియా కేసులకు కలుషిత ఆహారం కారణమై ఉండవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. స్థానిక వీధి వ్యాపారి విక్రయించిన బజ్జీలు, పునుగులు తినడం వల్ల ఆహార విషబాధకు గురై ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.నివేదిక ప్రకారం, జూన్ 27 నాటికి గ్రామంలో మొత్తం 32 మంది డయేరియా బారిన పడ్డారు. బాధితుల్లో తరచుగా విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి. వారిలో 23 మందిని దుగ్గుదూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇన్‌పేషెంట్లుగా చేర్చి చికిత్స అందిస్తుండగా, మరో 9 మంది అవుట్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు.
బాధితులకు రింగర్ లాక్టేట్ ద్రావణం, యాంటీబయాటిక్స్, మెట్రోనిడజోల్, పాంటోప్రాజోల్, ఒండాన్సెట్రాన్, పారాసిటమాల్, డైసైక్లోమైన్‌తో పాటు అవసరమైన సహాయక చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయ పరిస్థితి ఏదీ లేదని, ఎటువంటి మరణాలు సంభవించలేదని జిల్లా వైద్య శాఖ వెల్లడించింది.ఘటనపై సమాచారం అందిన వెంటనే జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి, జిల్లా వైద్యాధికారి, ఎపిడెమియాలజిస్ట్, ఎపిడెమిక్ సెల్ సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డీఎంఅండ్‌హెచ్‌వో స్వయంగా దుగ్గుదూరు గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలను పర్యవేక్షించారు.గ్రామంలో ఇంటింటికీ ఆరోగ్య సర్వే నిర్వహించేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, దుగ్గుదూరు పీహెచ్‌సీలో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. సురక్షిత తాగునీరు, వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య చర్యలు, క్రిమిసంహార కార్యక్రమాలు చేపట్టారు.ఆహార విషబాధకు గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కె.వి.సుబ్బారావు ద్వారా ఆహార నమూనాలను సేకరించగా, తాగునీటి నాణ్యతను పరిశీలించాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామంలో పరిస్థితిపై జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు.