PEN POWER
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 4:56 pm Posted By : SIVA KUMAR LANKA

నర్సీపట్నంలో సురభి వారి పౌరాణిక నాటక ప్రదర్శనలు

నర్సీపట్నం, పెన్ పవర్ :

​నర్సీపట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జూన్ 14, 15 తేదీలలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో అపూర్వమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం జరగనుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చొరవతో సుప్రసిద్ధ శ్రీ వినాయక నాట్యమండలి (సురభి) వారిచే భారీ పౌరాణిక నాటక ప్రదర్శనలను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్పీకర్ పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ కార్యక్రమంలో జూన్ 14వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంటలకు ‘మాయాబజార్’ నాటకాన్ని, 15వ తేదీ సోమవారం సాయంత్రం 5గంటలకు ‘శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం’ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చరిత్రను, మహిమలను భక్తులకు కళ్లకు కట్టినట్లు చూపించే ఉద్దేశంతో భారీ సినీ సెట్టింగ్స్‌తో ఈ దైవిక కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ​గతంలో శ్రీవారి కళ్యాణాన్ని కనులారా వీక్షించిన భక్తులు, ఈసారి నాటక రూపంలో అద్భుతమైన సాంకేతిక విలువలతో, అచ్చం సినిమాను తలపించేలా చూడవచ్చని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన సురభి నాటక సంస్థకు ఉన్న ప్రత్యేకతను ఆయన వివరిస్తూ, ఒకప్పుడు వారి ప్రదర్శనలు చూడటానికి మన ప్రాంత ప్రజలు శ్రీకాకుళం, తిరుపతి వంటి దూరప్రాంతాలకు సైతం వెళ్లేవారని గుర్తుచేశారు. అటువంటి అరుదైన అవకాశం ఇప్పుడు నర్సీపట్నం వాసుల ముందుకు రావడం ఎంతో సంతోషకరమన్నారు. మునుపెన్నడూ చూడని విధంగా ఈ నాటక ప్రదర్శనలు అందరినీ అలరిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సురభి నాటకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ రెండు రోజుల పాటు జరిగే ప్రదర్శనలకు నర్సీపట్నం, మాకవరపాలెం తదితర ప్రాంతాల నుంచి నియోజకవర్గ ప్రజలు, మహిళలు, శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ భారీ కార్యక్రమానికి దేవాదాయ శాఖ, స్థానిక పెద్దల సహకారం కూడా ఎంతో ఉందని, ప్రతి ఒక్కరూ ఈ పౌరాణిక నాటకాలను వీక్షించి, విజయవంతం చేయడంతో పాటు స్వామివారి కృపకు పాత్రులు కావాలని గౌరవ స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు.