5 బైకులు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్
నర్సీపట్నం, పెన్ పవర్ :
గ్రామీణ ప్రాంతాలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నాతవరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం డి.ఎస్.పి పి.శ్రీనివాసరావు మీడియా ముందు ఉంచారు. శనివారం ఉదయం నాతవరం మండలం వెదురుపల్లి జంక్షన్ వద్ద ఎస్సై తారకేశ్వరరావు సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఒక బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించారు. వారిని ఆపే ప్రయత్నం చేయగా, పోలీసులను చూసి వారు పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా మైదాన ప్రాంతంలో బైకులను దొంగిలించి, ఏజెన్సీలో తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. బైకులు అమ్మగా వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడపడమే కాకుండా, ఏజెన్సీలో గంజాయిని కొనుగోలు చేసి మైదాన ప్రాంతంలో అమ్ముతున్నట్లు గుర్తించారు.

అరెస్ట్ అయిన వారిలో మాతిరెడ్డి మనోజ్, కిర్లంపల్లి సుబ్రహ్మణ్య కిరణ్, వంతల కొండబాబు ఉన్నారు. నిందితుల సమాచారం మేరకు దాచి ఉంచిన బైకులను స్వాధీనపరుచుకున్నారు. వీటి విలువ సుమారు నాలుగు లక్షల 50 వేలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులను, స్వాధీన పరుచుకున్న బైకులను మీడియా ముందు ఉంచారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన నాతవరం ఎస్సై తారకేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ మహేష్, గిరి, కృష్ణ లను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారని డి.ఎస్.పి శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ నాతవరం ఎస్సై తారకేశ్వరరావు పాల్గొన్నారు.