పిల్లి సూర్యప్రకాశ్‌కు కూటమి నాయకుల హెచ్చరిక
రామచంద్రపురం, పెన్ పవర్, జూన్ 13:
రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ పిల్లి సూర్యప్రకాశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యంపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, లేకుంటే వైసీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూటమి పార్టీ నాయకులు, ద్రాక్షారామం మాజీ సర్పంచ్ కొత్తపల్లి అరుణ హెచ్చరించారు.ద్రాక్షారామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై రాజకీయ విమర్శలు చేయడం సహజమేనని, అయితే వ్యక్తిగత దూషణలు చేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. మంత్రి సుభాష్‌ను, ఆయన తండ్రి వాసంశెట్టి సత్యంను ఏకవచనంతో సంబోధిస్తూ విమర్శించడం సరికాదన్నారు.రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి సుభాష్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు. గత మూడు దశాబ్దాల్లో ఏ నాయకుడు చేయని అభివృద్ధి పనులను మంత్రి సుభాష్ తక్కువ కాలంలోనే చేసి చూపించారని కొనియాడారు. శిరోముండనం బాధితులకు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కుల ధ్రువీకరణ పత్రాల సమస్యను ఆయన చొరవతో పరిష్కరించారని పేర్కొన్నారు.
సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా వేలాది మందికి అండగా నిలుస్తున్న వాసంశెట్టి సత్యంపై కూడా అనవసర విమర్శలు చేయడం సరికాదన్నారు. మాజీ సర్పంచ్ కొత్తపల్లి అరుణ మాట్లాడుతూ, సుమారు రూ.250 కోట్ల విలువైన అభివృద్ధి పనులతో నియోజకవర్గ రూపురేఖలు మార్చేశారని తెలిపారు. ద్రాక్షారామంలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ మంజూరు, తాగునీటి సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి వంటి అనేక పనులు మంత్రి సుభాష్ చొరవతో జరిగాయని వివరించారు.
అలాగే నిరుద్యోగ యువత కోసం 45 జాబ్ మేళాలు, మహిళల కోసం వృత్తి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులను విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచిస్తూ, అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో కె. సుబ్రహ్మణ్యం, కనికెళ్ల సత్తిబాబు, గుంటూరు వరప్రసాద్, పెయ్యల బాబేలు, కాశి స్వామి, కనికెళ్ల సూర్యనారాయణతో పాటు కూటమి పార్టీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.