‘
స్వయం సహాయక సంఘాల నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట
ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి
గంగవరం /దేవీపట్నం, పెన్ పవర్, జూన్ 5: స్వయం సహాయక సంఘాల ఆర్థిక కార్యకలాపాల్లో పూర్తి పారదర్శకత తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు. శుక్రవారం దేవీపట్నం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు కారం పోశమ్మ అధ్యక్షతన నిర్వహించిన ‘మన డబ్బు–మన లెక్కలు’ యాప్ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ పొదుపులు, రుణాలు, చెల్లింపులు, వడ్డీ వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గతంలో కొంతమంది నిరక్షరాస్య మహిళలను తప్పుదోవ పట్టించి ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు.‘మన డబ్బు–మన లెక్కలు’ యాప్ ద్వారా సభ్యులు తమ మొబైల్ ఫోన్‌లోనే పొదుపు వివరాలు, తీసుకున్న రుణాలు, చెల్లించిన మొత్తాలు, బకాయిలు, వడ్డీ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చన్నారు. బ్యాంకుల చుట్టూ తిరగకుండానే అవసరమైన సమాచారాన్ని నేరుగా యాప్ ద్వారా పొందే అవకాశం కల్పించబడిందని తెలిపారు.డిజిటలైజేషన్‌లో భాగంగా స్వయం సహాయక సంఘాల ఆర్థిక వ్యవహారాలను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. దీని ద్వారా నిధుల దుర్వినియోగం, అవకతవకలు, సభ్యులకు తెలియకుండా వారి పేర్లపై రుణాలు పొందడం వంటి చర్యలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. ప్రతి సభ్యురాలు యాప్ వినియోగంపై అవగాహన పెంపొందించుకుని ఆర్థిక లావాదేవీలను స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గోళ్ల చంటిబాబు, రంపచోడవరం మండల పార్టీ అధ్యక్షుడు పెంటపాటి అనంత మోహన్, సీతపల్లి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు సిద్ధా వెంకన్నదొర, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు అడబాల బాపిరాజు, ఏపీఎం నీలి సూరిబాబు, మండల సమాఖ్య అధ్యక్షురాలు కారం పోశమ్మ, కార్యదర్శి మడకం సంకురమ్మ, కోశాధికారి పాములేటి దేవీశ్వరి తదితరులు పాల్గొన్నారు.