టీడీపీ నాయకుడు చెండా బాబుజి
ముంచంగిపుట్టు, పెన్ పవర్, జూన్ 10:మండలంలోని మాకవరం పంచాయతీ పరిధిలో ఉన్న కుంభీరిపడ తదితర గ్రామాల్లో అంగన్వాడి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి స్థానాల్లో నూతన భవనాలు మంజూరు చేయాలని టీడీపీ నాయకుడు చెండా బాబుజి కోరారు. బుధవారం ముంచంగిపుట్టు కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ఆయన వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా చెండా బాబుజి మాట్లాడుతూ మాకవరం పంచాయతీ పరిధిలోని కుంభీరిపడ గ్రామ అంగన్వాడి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. చిన్నారులు, సిబ్బంది భద్రత దృష్ట్యా వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరినట్లు తెలిపారు.అలాగే మేభ, మాకవరం, అల్లంగిపడ, అరబీరు, లబడాపుట్టు, కేందుపుట్టు, మొక్కపుట్టు గ్రామాల్లో కొత్త అంగన్వాడి భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు చెప్పారు. మాకవరం పంచాయతీ పరిధిలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి కె.జగత్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.