PEN POWER
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 6:43 am Posted By : D Ratnam

సంక్షేమం అందని ఒంటరి వితంతువు..

 

ప్రభుత్వ వ్యవస్థపై పలివెల మహిళ ప్రశ్నలు రెండేళ్లుగా ఎదురుచూపులే..
కొత్తపేట, పెన్ పవర్, జూన్ 13:
ప్రభుత్వాలు మారినా తన జీవితం మాత్రం మారలేదంటూ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన వితంతు ఒంటరి మహిళ గంటి మేరీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త మరణంతో కుటుంబానికి అండ కోల్పోయిన ఆమె జీవనోపాధి కోసం పోరాడుతూనే వితంతు పెన్షన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతోంది.అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
ఎదుర్కొంటున్నానని ఆమె చెబుతోంది.ఎన్నోసార్లు దరఖాస్తులు చేసుకున్నా, అధికారులను కలిసినా, నాయకులను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని కన్నీటి పర్యంతమవుతోంది.
“ప్రభుత్వం పేదల కోసం, వితంతువుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెబుతోంది. అయితే నా వంటి వారికి ఆ పథకాల ఫలాలు ఎందుకు అందడం లేదు? నేను ఈ నియోజకవర్గంలో ఒక్కదాన్నేనా?” అంటూ ప్రశ్నిస్తోంది.
కొన్ని రోజుల క్రితం స్థానిక దాతలు కొంత ఆర్థిక సహాయం అందించినప్పటికీ అది తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదని గ్రామస్తులు అంటున్నారు. నెలవారీ ఆదాయం లేక, కుటుంబ పోషణ భారంగా మారిన నేపథ్యంలో పెన్షన్ మంజూరు కావడం ఆమెకు జీవనాధారంగా మారుతుందని చెబుతున్నారు.
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని చెబుతున్న వేళ, గంటి మేరీ వంటి అర్హులైన వితంతు మహిళలు ఇంకా ఎదురుచూపుల్లో ఉండటం పలు ప్రశ్నలకు తావిస్తోంది. సంబంధిత అధికారులు ఆమె దరఖాస్తును వెంటనే పరిశీలించి న్యాయం చేయాలని గ్రామస్తులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.