PEN POWER
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 11:01 pm Posted By : D Ratnam

సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి విశిష్ట స్థానం

 

వీరప్పదొర పదవీ విరమణ సన్మాన సభలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లేశ్వరరావు

గంగవరం, పెన్ పవర్, జూన్ 7:
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని, ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైన సేవా వృత్తిగా నిలుస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి (ఏజెన్సీ) వై. మల్లేశ్వరరావు పేర్కొన్నారు.

 

మండలంలోని పెద్దగార్లపాడు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కోసు వీరప్పదొర పదవీ విరమణ సందర్భంగా ఆదివారం నిర్వహించిన సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.దేవీపట్నం మండలం పోతవరం సంక్షేమ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ మే 31న పదవీ విరమణ పొందిన వీరప్పదొరకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు మాట్లాడుతూ, దాదాపు 39 సంవత్సరాల పాటు విద్యాశాఖలో అంకితభావంతో సేవలందించిన వీరప్పదొర విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందించి పదవీ విరమణ పొందడం గొప్ప అదృష్టమని, ఆయన సేవలు యువ ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.

 

కార్యక్రమంలో వైరామవరం ఎంపీడీవో కె. బాపన్నదొర, దేవీపట్నం మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో-1) త్రిమూర్తులు పాల్గొని వీరప్పదొర విద్యా రంగానికి చేసిన సేవలను ప్రశంసించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావం చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిసి వీరప్పదొర దంపతులను ఘనంగా సత్కరించి శాలువాలు, జ్ఞాపికలు అందజేశారు. పలువురు వక్తలు ఆయన సేవా విశేషాలను గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలిపారు.యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంగవరం మండల యూటీఎఫ్ అధ్యక్షుడు కారం బుజ్జిదొర, మాజీ సర్పంచ్ కారం లక్ష్మి, పీసా ఉపాధ్యక్షుడు ఎం. చిన్నబ్బాయిదొర, వీఎస్ఎస్ చైర్మన్ మడకం పొట్టిదొర, మోహనాపురం ఆశ్రమ బాలురు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.వి.వి. సత్యనారాయణ, విశ్రాంత వైద్యాధికారి వీరబ్బాయిదొర, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు స్వామిదొర, యూనియన్ బ్యాంకు మేనేజర్ టి. బాలరాజు, డిజిటల్ అసిస్టెంట్ స్వామిదొర, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, గిరిజన సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.