- కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు..
- హామీల ప్రచారం ఒకవైపు.. కార్యకర్తల ఆవేదన మరోవైపు
- రెండేళ్ల పాలనపై మిశ్రమ స్పందనలు
- అభివృద్ధి కనిపిస్తున్నా సంక్షేమంపై ప్రశ్నలు
- క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్‌కు దూరమవుతున్న నాయకత్వం?
- గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న పార్టీ కార్యకర్తలు
- వలస నేతలకు ప్రాధాన్యం.. పాత కేడర్‌లో అసంతృప్తి
- భవిష్యత్ రాజకీయాలకు హెచ్చరిక సంకేతాలా?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ అధికార పక్షం అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ప్రవాహాన్ని విజయాలుగా ప్రస్తావిస్తుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి, గుర్తింపు కోసం ఎదురుచూపులు నాయకత్వానికి కొత్త సవాలుగా మారుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి శ్రమించిన కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కడం లేదనే భావనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సంక్షేమ పథకాల అమలు, స్థానిక నాయకత్వ పనితీరు, కేడర్‌తో సమన్వయం వంటి అంశాలపై అసంతృప్తి స్వరాలు క్రమంగా బయటపడుతున్నాయి.
కేడర్‌లో నిర్లేపం… నిక్షిప్తమైన అసంతృప్తి ,కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తి.. కార్యకర్తల మనోగతం ఏమిటి? అనే దానిపై వివరణాత్మక కథనం పెన్ పవవర్ పాఠకుల కోసం
పెన్ పవర్ ప్రత్యేక ప్రతినిధి , విజయవాడ, జూన్ 15 :
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ విజయాలు, వాస్తవ పరిస్థితులపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తరచూ సూపర్ సిక్స్ హామీల అమలు, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన వంటి అంశాలను ప్రభుత్వ ప్రధాన విజయాలుగా ప్రస్తావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు అదే స్థాయిలో ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడం, పారిశ్రామిక రంగంలో చురుకుదనం కనిపించడం, కొత్త సంస్థలు రావడం వంటి అంశాలను రాజకీయ ప్రత్యర్థులు కూడా పూర్తిగా ఖండించడం లేదు. కానీ ఎన్నికల్లో విజయాన్ని నిర్ణయించేది కేవలం అభివృద్ధి కార్యక్రమాలే కాదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ప్రజలకు నేరుగా చేరే సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యల పరిష్కారం, కార్యకర్తల సంతృప్తి కూడా అంతే కీలకమని చెబుతున్నారు.ప్రభుత్వం ప్రకటించిన పలు సంక్షేమ కార్యక్రమాలు అందరికీ సమానంగా చేరడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిధుల కొరత, అర్హతల పరిశీలన, పరిపాలనా పరిమితులు వంటి కారణాలతో కొంతమంది లబ్ధిదారులు పథకాల నుంచి బయటపడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం చెబుతున్న విజయ గాథలకు, ప్రజలు అనుభవిస్తున్న వాస్తవ పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉందని విమర్శకులు అంటున్నారు.
ఇక పార్టీ వ్యవస్థాపక బలం అయిన కార్యకర్తల విషయానికి వస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలు పరిష్కారమవుతాయని, రాజకీయంగా గుర్తింపు లభిస్తుందని భావించిన అనేక మంది నిరాశకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలు అధికార వ్యవస్థలో తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.ముఖ్యంగా గతంలో ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న నేతలు అధికార పార్టీలో చేరిన తర్వాత వారికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందనే భావన పాత కేడర్‌లో అసంతృప్తికి కారణమవుతోంది. సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన వారికి దక్కని గౌరవం, అవకాశాలు కొత్తగా వచ్చిన వారికి లభిస్తున్నాయనే అభిప్రాయం కార్యకర్తల్లో బలపడుతోంది.
మరో కీలక అంశం క్షేత్రస్థాయి సమాచార సేకరణ. గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకుల పనితీరుపై నిరంతర సమీక్షలు నిర్వహించేది. ప్రస్తుతం అలాంటి వ్యవస్థ అంతగా కనిపించడం లేదని కొందరు పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. పార్టీ కార్యాలయాల నుంచి వచ్చే నివేదికలు మాత్రమే ఆధారంగా తీసుకోవడం వల్ల వాస్తవ పరిస్థితులు నాయకత్వానికి పూర్తిగా చేరడం లేదని అంటున్నారు.అధికార పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయాలని నాయకత్వం కార్యకర్తలకు పిలుపునిస్తుండగా, కొంతమంది కార్యకర్తలు మాత్రం తమ అంతర్గత అసంతృప్తిని బయటపెట్టలేక మౌనంగా ఉంటున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రజలకు చెప్పే విజయాల కంటే తమకు ఎదురవుతున్న సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
రాజకీయంగా చూస్తే అధికారంలో ఉన్న పార్టీకి కేడర్ సంతృప్తి అత్యంత కీలకం. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంలో కార్యకర్తలే ప్రధాన వారధిగా ఉంటారు. అలాంటి కేడర్‌లో అసంతృప్తి పెరిగితే అది భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముంటుంది. అందుకే క్షేత్రస్థాయి పరిస్థితులను నేరుగా తెలుసుకుని, కార్యకర్తలతో మరింత సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. రెండేళ్ల పాలన అనంతరం కూటమి ప్రభుత్వం విజయాలను ప్రచారం చేస్తున్న ఈ సమయంలో, కేడర్‌లో వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలు నాయకత్వానికి హెచ్చరిక సంకేతాలుగా మారుతాయా? లేక సమయానికి సమస్యలను పరిష్కరించి పార్టీ మరింత బలపడుతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.