PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 10:45 am Posted By : PEN POWER MEDIA

పాలనపై పట్టు తప్పుతోందా?..

కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక గంటలు మోగిస్తున్న అంతర్గత అసంతృప్తి
సాయికృష్ణ ఘటనపై ప్రభుత్వ స్పందన ఆలస్యమైందా?
పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న అసంతృప్తి సంకేతాలు
కాపు సామాజికవర్గంపై రాజకీయ పార్టీల దృష్టి
పవన్ కల్యాణ్–బీజేపీ సమీకరణలపై ఆధారపడుతున్న కూటమి?
మూడో సంవత్సరం పాలనకు కీలక పరీక్ష
కేడర్, ఓటు బ్యాంకును కాపాడుకోవడంపై చర్చ

రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాజకీయ, సామాజిక సమీకరణాల పరంగా కీలక దశలో నిలిచింది. పరిపాలనలో వేగం తగ్గిందా, కీలక వర్గాల మద్దతును నిలబెట్టుకునే విషయంలో లోపాలు కనిపిస్తున్నాయా అనే చర్చ అధికార పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది.

 

విజయవాడ, పెన్ పవర్, జూన్ 24 :

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పరిపాలనా శైలి, రాజకీయ వ్యూహాలపై చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, ప్రభుత్వ నిర్ణయాలు, వ్యవహార శైలిపై అధికార పార్టీ శ్రేణుల్లోనే కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో చూపిన పరిపాలనా చురుకుదనం ప్రస్తుతం కనిపించడం లేదన్న అభిప్రాయం కొంతమంది నేతల నుంచి వ్యక్తమవుతోంది.ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే వ్యూహాలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినప్పటికీ, పార్టీకి అండగా నిలిచిన వర్గాలను మరింత బలోపేతం చేసే అంశంలో ఆశించిన స్థాయిలో చొరవ కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

సాయికృష్ణ ఘటనలో ఆలస్యమే నష్టానికి కారణమా? : ఇటీవల విజయవాడలో చోటుచేసుకున్న సాయికృష్ణ ఘటన ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై చర్చకు దారి తీసింది. సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వేగంగా స్పందించి ఉంటే వివాదం ఇంత పెద్దది అయ్యేది కాదన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభ దశలోనే బాధ్యులపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి పార్టీ తరఫున సీనియర్ నాయకులను పంపించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చివరకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్న తర్వాతే చర్యలు వేగం పుంజుకోవడం కూడా విమర్శలకు కారణమైంది.

రాజకీయంగా సున్నితమైన సామాజిక సమీకరణాలు : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రభావం కీలకం. ముఖ్యంగా కాపు, కమ్మ, బీసీ, మాదిగ వంటి వర్గాల మద్దతు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశంగా భావిస్తారు. కాపు సామాజికవర్గం రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఓటు బ్యాంకుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ వర్గంలో ఏర్పడే చిన్న అసంతృప్తి కూడా రాజకీయంగా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పవన్ కల్యాణ్ మద్దతుపైనే అధిక ఆధారపడుతున్నారా? : కూటమి ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, అలాగే బీజేపీ మద్దతు కీలక బలంగా నిలిచాయి. అయితే భవిష్యత్ ఎన్నికల్లో కూడా ఇదే సమీకరణలు కొనసాగుతాయనే అంచనాతో ప్రధాన పార్టీలు తమ సొంత ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేయడంపై తగిన దృష్టి సారించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయంగా స్థిరమైన విజయానికి మిత్రపక్షాల బలం మాత్రమే కాకుండా, కేడర్ మరియు సంప్రదాయ ఓటర్లతో బలమైన అనుబంధం కూడా అవసరమని పార్టీ నేతలు చెబుతున్నారు.

మూడో సంవత్సరం కూటమికి అగ్నిపరీక్ష : ప్రభుత్వ పాలనలో మొదటి రెండేళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మిగిలిన మూడేళ్లు కూటమి భవిష్యత్తును నిర్ణయించే కాలంగా భావిస్తున్నారు.సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి, పరిపాలనలో పారదర్శకత వంటి అంశాలతో పాటు సామాజిక సమతుల్యతను కాపాడుకోవడం కూడా ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారనుంది.

హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటుందా? : పార్టీ అంతర్గతంగా వినిపిస్తున్న అభిప్రాయాలను ప్రభుత్వం ఎంత మేరకు పరిగణనలోకి తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిన్న సమస్యలను ప్రారంభ దశలోనే పరిష్కరించడం, కేడర్‌తో నిరంతర సంబంధాలు కొనసాగించడం, ప్రజల స్పందనను వేగంగా అర్థం చేసుకోవడం వంటి అంశాలు భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లో కీలకంగా మారనున్నాయి. రాజకీయంగా బలమైన స్థితిలో ఉన్నప్పటికీ, అప్రమత్తత కోల్పోతే చిన్న సమస్యలే పెద్ద సవాళ్లుగా మారే అవకాశముందని పరిశీలకులు సూచిస్తున్నారు.