PEN POWER
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 11:02 am Posted By : D Ratnam

మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

డ్రగ్స్ నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర కీలకం : సీఐ గజేంద్రకుమార్

గంగవరం, జూన్ 28 (పెన్ పవర్): మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్రకుమార్ అన్నారు. శనివారం పాత గంగవరం వారపు సంతలో మహిళల భద్రత మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ గజేంద్రకుమార్ మాట్లాడుతూ మహిళల రక్షణకు ప్రభుత్వం అనేక చట్టాలు, ప్రత్యేక వ్యవస్థలను అమలు చేస్తోందని, మహిళలు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళలపై వేధింపులు, సైబర్ మోసాలు లేదా ఇతర నేరాలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.ప్రస్తుతం యువతలో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్న ఆయన, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారని, గంజాయి రవాణా చేయడం, నిల్వ చేయడం లేదా వినియోగించడం కూడా నేరమేనని హెచ్చరించారు. గంజాయి సంబంధిత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1972, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 నంబర్‌కు వెంటనే సమాచారం అందించాలని కోరారు.అనంతరం ఎస్సై వెంకయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మహిళల పట్ల గౌరవప్రదమైన ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గంగవరం ఏఎస్ఐ రత్నాకర్, పీసీలు అప్పలరాజు, అశోక్ కొండబాబు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.