జొన్నగిరిలో సీఎం చేతుల మీదుగా గోల్డ్ ప్లాంట్ ప్రారంభం
1500 ఎకరాల్లో 50 టన్నుల బంగారు నిల్వల అంచనా
మొదటి దశలో 400 కిలోల ఉత్పత్తి లక్ష్యం
రూ.405 కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ మైనింగ్ ప్రాజెక్టు
రాష్ట్రానికి రూ.150 కోట్ల వరకు రాయల్టీ ఆదాయం
700 మందికి ఉపాధి.. రాయలసీమ ఆర్థిక ముఖచిత్రం మారేనా?
కరవుతో పోరాడిన రాయలసీమ ఇప్పుడు బంగారు నిక్షేపాలతో కొత్త చరిత్ర రాయబోతోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ప్రారంభమైన గోల్డ్ ఫీల్డ్స్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి వందల కోట్ల ఆదాయంతో పాటు వేలాది ఉద్యోగ అవకాశాలు అందనున్నాయి.
కర్నూలు, పెన్ పవర్, జూన్ 24 :
ఎన్నో దశాబ్దాలుగా కరవు, వలసలు, ఉపాధి సమస్యలతో గుర్తింపు పొందిన రాయలసీమ ఇప్పుడు దేశవ్యాప్తంగా “పసిడి సీమ”గా గుర్తింపు పొందే దిశగా అడుగులు వేస్తోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని ప్రాజెక్టు ఉత్పత్తి దశలోకి ప్రవేశించడం ఈ ప్రాంత ఆర్థిక భవిష్యత్తుకు కొత్త ఆశలను నింపుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు. రాష్ట్రంలో ఖనిజ సంపద వినియోగానికి ఇది కీలక మైలురాయిగా నిలవనుందని అధికారులు భావిస్తున్నారు.
50 టన్నుల బంగారు నిక్షేపాల అంచనా : ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ అంచనాల ప్రకారం జొన్నగిరి ప్రాంతంలో సుమారు 50 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ప్రస్తుతం కేటాయించిన 1500 ఎకరాల విస్తీర్ణంలో మొదటి దశలో 500 ఎకరాల పరిధిలో మాత్రమే అన్వేషణ, తవ్వకాలు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలోనే దాదాపు 13 టన్నుల బంగారం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన వెయ్యి ఎకరాల్లో భవిష్యత్‌లో విస్తృత స్థాయిలో అన్వేషణ చేపట్టనున్నారు.
తొలి ఏడాదే 400 కిలోల బంగారం లక్ష్యం : ప్రాజెక్టు ప్రారంభ దశలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో 400 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. రెండో ఏడాదికి ఉత్పత్తిని వెయ్యి కిలోలకు పెంచే ప్రణాళిక సిద్ధమైంది. తదుపరి దశలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు వేల కిలోలు (2 టన్నులు) వరకు పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది దేశీయ బంగారం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం తీసుకురానుంది.
రూ.405 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టు : జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ ప్రాజెక్టును జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే రూ.405 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బంగారు గనుల తవ్వకం అత్యంత ఖరీదైన, సాంకేతిక నైపుణ్యం అవసరమైన రంగం కావడంతో ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు.
రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల ఆదాయం : బంగారం ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు శాతం రాయల్టీ లభించనుంది. ప్రస్తుత ధరల ప్రకారం తొలి ఏడాది 400 కిలోల బంగారం ఉత్పత్తి జరిగితే సుమారు రూ.57 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది. ఉత్పత్తి వెయ్యి కిలోలకు చేరుకున్నప్పుడు రాష్ట్రానికి రాయల్టీ రూపంలో రూ.144 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
700 మందికి ప్రత్యక్ష ఉపాధి : ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. వీరిలో 80 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే ఉండనున్నారు. అదనంగా రవాణా, లాజిస్టిక్స్, నిర్మాణం, సేవల రంగాల్లో వేలాది మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. దీంతో తుగ్గలి, పత్తికొండ, డోన్ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకునే అవకాశం ఉంది.
రాయలసీమను ‘గోల్డ్ బెల్ట్’గా తీర్చిదిద్దే ప్రణాళిక : జొన్నగిరితో పాటు అనంతపురం జిల్లా రామగిరి, చిగురుకుంట, జవ్వాకుల బిస్నాతం ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు గుర్తించినట్లు గనుల శాఖ వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో అన్వేషణలు విజయవంతమైతే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రముఖ బంగారం ఉత్పత్తి రాష్ట్రంగా అవతరించే అవకాశాలు ఉన్నాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.