PEN POWER
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 12:44 pm Posted By : PEN POWER MEDIA

హైదరాబాద్‌లో ‘కాక్రోచ్’ల గర్జన..!

యువత ఆగ్రహానికి వేధికగా  ఇందిరాపార్క్  
నీట్ లీకేజీపై దేశవ్యాప్త నిరసనలకు శ్రీకారం..! 
కేంద్ర మంత్రిపై రాజీనామా డిమాండ్
ఇందిరాపార్క్ వద్ద విద్యార్థుల భారీ సమీకరణ
నీట్   లీకేజీపై యువతలో ఉప్పొంగుతున్న ఆగ్రహం
‘రాజ్యాంగం జిందాబాద్’ నినాదాలతో మారుమోగిన ధర్నా చౌక్
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్
సోనమ్ వాంగ్‌చుక్ రాకతో ఉద్యమానికి మరింత ఊపు
సోషల్ మీడియా ఉద్యమం నుంచి వీధి పోరాటాల దాకా సీజేపీ ప్రయాణం

 
నీట్  పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తోంది. ఆ ఆగ్రహానికి ప్రతిరూపంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ శాంతియుత నిరసన ప్రారంభమైంది. వేలాది మంది యువత, విద్యార్థులు రాజ్యాంగ పరిరక్షణ నినాదాలతో రోడ్లపైకి వచ్చారు. పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.
 
 
 స్టేట్ బ్యూరో పెన్ పవర్   హైదరాబాద్, జూన్ 14 :

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్  పేపర్ లీకేజీ వ్యవహారంపై యువత ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది. విద్యా వ్యవస్థ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ శనివారం నిరసనల కేంద్రంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ  ఆధ్వర్యంలో ప్రారంభమైన శాంతియుత ఆందోళనలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం నుంచే ధర్నా చౌక్‌కు చేరుకున్న యువత చేతుల్లో రాజ్యాంగ ప్రతులు, ప్లకార్డులు కనిపించాయి. “రాజ్యాంగం జిందాబాద్”, “విద్యార్థులకు న్యాయం చేయాలి”, “పరీక్షల వ్యవస్థను కాపాడాలి” వంటి నినాదాలతో నిరసన ప్రాంగణం మారుమోగింది. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

పేపర్ లీకేజీ ఘటన దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉందని ఆందోళనకారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే పారదర్శక విచారణతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ నిరసనలో పాల్గొంటున్న యువతలో అధిక శాతం మంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులే కావడం విశేషం. పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాల వల్ల తమ కష్టానికి విలువ లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కాసేపట్లో ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు సీజేపీ  అధికార ప్రతినిధి విజేత్ దహియా సభలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారి ప్రసంగాలపై యువతలో ఆసక్తి నెలకొంది. ఈ సభ ద్వారా విద్యా వ్యవస్థ సంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలవుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఇప్పుడు వీధి స్థాయి నిరసనల దశకు చేరుకుంది. యువత సమస్యలు, విద్యా రంగంలో అవకతవకలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ వంటి అంశాలతో ఈ ఉద్యమం ముందుకు సాగుతోంది. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ ఆందోళన దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.