PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 10:06 am Posted By : PEN POWER MEDIA

వేమూరు రైల్వేస్టేషన్‌కు మూడో లూప్‌లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.20.58 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

రూ.20.58 కోట్లతో మూడో లూప్‌లైన్‌కు ఆమోదం
గూడ్స్ రైళ్ల రద్దీకి శాశ్వత పరిష్కారం
రైతుల సరకు రవాణాకు కొత్త అవకాశాలు
ప్లాట్‌ఫారాల విస్తరణతో ప్రయాణికులకు సౌకర్యం
తాత్కాలిక నిల్వ కేంద్రాలు, అంతర్గత రోడ్ల నిర్మాణం
ఉపాధి అవకాశాలకు కేంద్రంగా వేమూరు స్టేషన్
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. వేమూరు రైల్వేస్టేషన్‌కు మూడో లూప్‌లైన్

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేమూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి కేంద్ర రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.20.58 కోట్లతో మూడో లూప్‌లైన్ నిర్మాణంతో పాటు పలు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానుండటంతో గుంటూరు–బాపట్ల జిల్లాల ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించనుంది.

ప్రత్యేక ప్రతినిధి పెన్ పవర్ గుంటూరు, జూన్ 24 :

గుంటూరు, బాపట్ల జిల్లాల సరిహద్దులో ఉన్న వేమూరు రైల్వేస్టేషన్‌కు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులకు కేంద్ర రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వేస్టేషన్‌లో మూడో లూప్‌లైన్ నిర్మాణానికి రూ.20.58 కోట్ల నిధులను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుతో వేమూరు, తెనాలి ప్రాంతాల ప్రజలతో పాటు రైతులు, వ్యాపారులు, కార్మిక వర్గాలకు కూడా భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఈ రైల్వేస్టేషన్ మీదుగా ప్రయాణికుల రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లు కూడా అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. గూడ్స్ రైళ్ల లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియల కారణంగా పలు సందర్భాల్లో ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల సమయపాలన దెబ్బతినడంతో పాటు రైల్వే కార్యకలాపాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మూడో లూప్‌లైన్ నిర్మాణాన్ని రైల్వేశాఖ ప్రతిపాదించింది. తాజాగా నిధుల మంజూరుతో పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సరకు రవాణాకు వేగం : మూడో లూప్‌లైన్ అందుబాటులోకి వస్తే గూడ్స్ రైళ్లను ప్రత్యేకంగా నిలిపివేసి సరకు లోడింగ్, అన్‌లోడింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలవుతుంది. ఫలితంగా ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలకు ఎటువంటి ఆటంకం ఉండదని అధికారులు చెబుతున్నారు. దీంతో రైళ్ల సమయపాలన మెరుగుపడటమే కాకుండా సరకు రవాణా వేగం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

రైతులకు ప్రత్యక్ష లాభం : వేమూరు, తెనాలి ప్రాంతాలు వ్యవసాయ ప్రధాన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఈ ప్రాంతాల్లో పండే వరి, మిర్చి, పప్పుధాన్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో ఇతర ప్రాంతాలకు రవాణా చేసే అవకాశం ఏర్పడనుంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు వేగంగా దిగుమతి కావడంతో రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.

విస్తరించనున్న మౌలిక సదుపాయాలు : ఈ ప్రాజెక్టు కింద మూడో లూప్‌లైన్ నిర్మాణంతో పాటు ప్లాట్‌ఫారాల విస్తరణ, అంతర్గత రహదారుల నిర్మాణం, తాత్కాలిక నిల్వ కేంద్రాల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు. దీంతో గూడ్స్ రైళ్ల నిర్వహణ మరింత సులభతరం కానుంది. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడటంతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభించే అవకాశముంది.

ఉపాధికి కొత్త అవకాశాలు : రైల్వే అభివృద్ధి పనుల ద్వారా హమాలీలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, లారీ యజమానులు, చిన్న వ్యాపారులు, లోడింగ్ కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. గుంటూరు–బాపట్ల జిల్లాల మధ్య కీలక రైల్వే కేంద్రంగా వేమూరు స్టేషన్ మరింత ప్రాధాన్యత సంతరించుకోనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధికి కీలక మలుపుగా మారనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.