- కాంగ్రెస్‌పై షర్మిళ అసంతృప్తి? రాజ్యసభ ఆశలు ఆవిరి..
- ఇండియా కూటమికి దూరం వెనుక అసలు కారణాలేమిటి?
- రాజ్యసభ సీటు దక్కకపోవడంపై కాంగ్రెస్‌లో కొత్త చర్చ
- రాజ్యసభ ఆశలతో ఢిల్లీ పర్యటన చివరి నిమిషంలో మారిన సమీకరణాలు
- కాంగ్రెస్ హామీలపై షర్మిళ ఆవేదన? ఇండియా కూటమి సమావేశానికి ఎందుకు దూరం?
- వైసీపీ పాత్రపై అనుమానాల చర్చ తదుపరి రాజకీయ నిర్ణయాలపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ రాజకీయ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. కర్ణాటక నుంచి రాజ్యసభకు అవకాశం దక్కుతుందన్న అంచనాలు చివరి నిమిషంలో తారుమారు కావడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇండియా కూటమి కీలక సమావేశానికి షర్మిళ గైర్హాజరు కావడం, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాలపై ఆమె అసహనం వ్యక్తమవుతోందన్న సంకేతాలు వెలువడుతుండటంతో ఏపీ రాజకీయాల్లో కొత్త ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్‌లో ఆమె భవిష్యత్తు, తదుపరి రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
పెన్ పవర్ ప్రత్యేక కథనం | న్యూస్ డెస్క్ | జూన్ 15
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైఎస్ షర్మిళ కేంద్రబిందువుగా మారారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు అవకాశం లభిస్తుందన్న అంచనాల మధ్య చివరి నిమిషంలో ఆమె పేరు జాబితాలో లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఆమె అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జోరందుకుంది.
2024 ఎన్నికలకు ముందు తెలంగాణలో స్థాపించిన తన రాజకీయ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిళ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలను స్వీకరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తే భవిష్యత్తులో తగిన రాజకీయ గుర్తింపు లభిస్తుందనే నమ్మకంతో ఆమె ముందుకు సాగారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యత్వం విషయంలో కాంగ్రెస్ అగ్రనేతల నుంచి హామీలు వచ్చాయనే ప్రచారం అప్పట్లో జరిగింది.ఇటీవల కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో షర్మిళ పేరు బలంగా వినిపించింది. ఢిల్లీ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆమె నామినేషన్‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారనే సమాచారం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. అయితే చివరి క్షణంలో పరిస్థితులు మారిపోవడంతో ఆమెకు అవకాశం దక్కలేదు.
ఈ పరిణామం షర్మిళను తీవ్ర నిరాశకు గురి చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ కోసం తాను కష్టపడినా, ఇచ్చిన హామీ అమలు కాలేదన్న భావన ఆమెలో ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వం, వైసీపీ వర్గాల మధ్య ఉన్న సంబంధాలపై కూడా రాజకీయ చర్చ మొదలైంది. కొందరు నాయకుల జోక్యంతో తనకు రాజ్యసభ అవకాశం దూరమైందన్న అనుమానాలు షర్మిళలో ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి స్పష్టమైన వ్యాఖ్యలు వెలువడలేదు.
ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి షర్మిళ అనేక కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంలోనూ, ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలోనూ ఆమె చురుగ్గా వ్యవహరించారు. అలాంటి సమయంలో రాజ్యసభ అవకాశం కోల్పోవడం ఆమె రాజకీయ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో ఆమె సంబంధాలు ఎలా కొనసాగుతాయన్నదే ప్రధాన చర్చగా మారింది. పార్టీ అధిష్ఠానం ఆమెను సముదాయించే ప్రయత్నాలు చేస్తుందా? లేక ఆమె రాజకీయంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారా? అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో లభించనుంది.
ఏది ఏమైనప్పటికీ, రాజ్యసభ టికెట్ వ్యవహారం కేవలం ఒక పదవి అంశంగా కాకుండా, కాంగ్రెస్‌లో షర్మిళ భవిష్యత్తు రాజకీయ పాత్రను నిర్ణయించే కీలక మలుపుగా మారిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.