PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 10:38 am Posted By : PEN POWER MEDIA

చరిత్రకు చిహ్నమైన కనిగిరి ఊడల మర్రి కుంగిపోతుందా?

కనిగిరి దుర్గం చరిత్రకు జీవ సాక్ష్యంగా ఊడల మర్రి
వారం వ్యవధిలో ఆరు భారీ కొమ్మలు నేలకూలి
నిప్పు, యాసిడ్ పోశారనే ఆరోపణలపై కలకలం
ఆక్రమణ యత్నాల కారణంగానే చెట్టు దెబ్బతిందా?
పర్యావరణ ప్రేమికుల తీవ్ర ఆందోళన
శాస్త్రీయ సంరక్షణకు అధికారులను కోరుతున్న స్థానికులు

మార్కాపురం జిల్లా కనిగిరి దుర్గం దొరువు వద్ద వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఊడల మర్రి చెట్టు వరుసగా కూలిపోతున్న కొమ్మలతో ప్రమాద సంకేతాలు ఇస్తోంది. చెట్టు తొర్రల్లో నిప్పు పెట్టడం, యాసిడ్ పోయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా, అధికారులు వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఒంగోలు, పెన్ పవర్, జూన్ 24 :

మార్కాపురం జిల్లా కనిగిరి దుర్గం దొరువు ప్రాంతంలో వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఊడల మర్రి చెట్టు ఇప్పుడు క్రమంగా కుంగిపోతున్న దృశ్యం స్థానికులను కలవరపెడుతోంది. కనిగిరి కోట చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన ఈ మహావృక్షం వద్ద గత వారం రెండు భారీ కొమ్మలు విరిగిపోగా, తాజాగా మరో నాలుగు నేలవాలడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఒకప్పుడు రాజులు పాలన సాగించిన కనిగిరి కోట అడుగుభాగంలో ఉన్న ఈ మర్రి చెట్టు, దశాబ్దాలుగా ప్రజలకు విశ్రాంతి నిలయంగా, పర్యాటక ఆకర్షణగా, స్థానిక విద్యార్థులకు తీపి జ్ఞాపకంగా నిలిచింది. ఇప్పుడు అదే చెట్టు కూలిపోతున్న దుస్థితి పర్యావరణ ప్రేమికులను తీవ్రంగా కలిచివేస్తోంది.

కనిగిరి దుర్గం చరిత్రకు జీవ సాక్ష్యం : కనిగిరి దుర్గం దొరువుకు శతాబ్దాల చరిత్ర ఉంది. కొండపై నిర్మించిన కోట నుంచి పాలన సాగించిన రాజుల కాలం నుంచి ఈ ప్రాంతం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆ చారిత్రక నేపథ్యానికి జీవ సాక్ష్యంగా నిలిచింది ఈ ఊడల మర్రి. చెట్టు చుట్టూ ఎన్నో తరాల జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. చిన్నారులు ఆటలాడే స్థలం, విద్యార్థులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం, ప్రకృతి ప్రేమికులు ఫొటోలు తీసుకునే పర్యాటక కేంద్రంగా ఇది ప్రసిద్ధి చెందింది.

వారం వ్యవధిలో ఆరు భారీ కొమ్మలు నేలకూలి : స్థానికుల వివరాల ప్రకారం వారం రోజుల క్రితం రెండు భారీ కొమ్మలు విరిగిపోయాయి. ఆదివారం రాత్రి మరో నాలుగు కొమ్మలు ఒక్కసారిగా నేలవాలాయి. చెట్టు ప్రధాన మాను కూడా ఒక వైపు ఒరిగిపోవడంతో చెట్టు భవిష్యత్తుపై ఆందోళనలు మరింత పెరిగాయి. కొమ్మలు విరిగిన ప్రాంతాల్లో చెక్క పొరలు కాలినట్టుగా కనిపించడం అనుమానాలకు తావిస్తోంది.

నిప్పు, యాసిడ్ పోశారనే ఆరోపణలు : స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం కొందరు వ్యక్తులు చెట్టు తొర్రల్లో కావాలనే నిప్పు పెట్టారని, చెట్టు మొదలులో యాసిడ్ వంటి రసాయనాలు పోశారని అనుమానిస్తున్నారు. దీంతో కొమ్మలు పటుత్వం కోల్పోయి క్రమంగా విరిగిపోతున్నాయని చెబుతున్నారు. గతంలో కూడా చెట్టు సమీపంలోని స్థలాన్ని ఆక్రమించేందుకు యంత్రాలతో కొమ్మలు నరికిన ఘటనలు జరిగాయని, అప్పట్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారని గుర్తుచేస్తున్నారు.

పర్యావరణ ప్రేమికుల ఆందోళన : చెట్టు దుస్థితిని చూసిన పర్యావరణ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందల ఏళ్ల వయస్సున్న మహావృక్షం కోల్పోతే అది కేవలం ఒక చెట్టు నష్టమే కాకుండా చారిత్రక, పర్యావరణ వారసత్వానికి తీరని లోటు అవుతుందని చెబుతున్నారు. పర్యావరణ శాస్త్రవేత్తలు, వనశాఖ నిపుణులతో వెంటనే పరిశీలన చేయించి చెట్టు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయాలని వారు కోరుతున్నారు.

అధికారులు వెంటనే స్పందించాలన్న డిమాండ్ : స్థానిక ప్రజలు, ప్రకృతి ప్రేమికులు ప్రభుత్వాన్ని తక్షణ చర్యలకు కోరుతున్నారు. చెట్టు చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయడం, దెబ్బతిన్న భాగాలకు చికిత్స చేయడం, శాస్త్రీయ పద్ధతుల్లో సంరక్షణ చర్యలు చేపట్టడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నారు. చరిత్రను చెబుతున్న ఈ ఊడల మర్రి మరో తరం కూడా చూడాలంటే ఇప్పుడే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.