వరదలు సమర్ధవంతంగా ఎదుర్కోటానికి ప్రణాళిక సిద్ధం చేయండి
ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా చర్యలు
జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్
స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై:- గోదావరి శభరి నదులకు రానున్న వరదల పట్ల అన్ని శాఖలు అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, వరదలకు సంబంధించి ఐదారు రోజుల ము౦దుగానే సమాచారం వస్తుందని ఐదు రోజులు ముందుగా అవసరమైన సామగ్రిని, మేన్ పవర్ ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పునరావాస కేంద్రాల ఏర్పాటు, బోట్లు, లాంచీలు, ట్రాక్టర్లు అవసరం, డీజిల్, కిరోసిన్, సోలార్ లైట్లు, తార్ఫాలిన్లు, దోమతెరలు, మందులు మొదలగు అవసరాలను ముందుగానే అంచనా వేసి సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం,ఆస్థి నష్టం జరగకుండా వరదలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గుర్తించిన పునరావాస కేంద్రాలను ముందుగానే సందర్శించి తగు రహదారిని గుర్తించాలని,వరద బాధితులను తరలించే సందర్భంలో భాద్యత గల సిబ్బందిని ఎస్కార్ట్ పెట్టి తరలించాలని సూచించారు. మునిగిపోయిన రహదారులకు ప్రత్యామ్నాయ రహదారులను ముందుగానే గుర్తించి చిన్న చిన్న మరమ్మత్తులు,గోతులు పూడ్చటం లాంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆగష్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన రేషన్ సరుకులు ముందుగానే పంపిణీ చేయాలన్నారు. ప్రతి పునరావాస కేంద్రం వద్ద వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి అవసరమైన మందులు సిద్ధం చేయాలన్నారు.గత ఏడాది వరద బాధితులకు అందించిన సహాయ సహకారాలను దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవాలతో ఈ ఏడాది కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి అంటువ్యాధులు ప్రభాలకుండా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన మందులు, స్ప్రేయర్లు, డీజిల్, ట్రాక్టర్లు,కార్మికులు, దోమతెరలు సిద్ధం చేయాలన్నారు.డీజిల్, రేషన్, ఆహార పదార్ధాల స్టోరేజ్ పాయింట్లను గుర్తించాలని, అక్కడి నుండి అవసరమైన ప్రాంతాలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కంట్రోల్ రూములు, పునరావాస శిభిరాలలో 24 గంటలు విధులు నిర్వర్తించేలా డ్యూటీలు వేయాలని, వారికి నిర్వర్తించవలసిన విధుల గూర్చి తెలియజేయాలని, ఆయా ప్రాంతాలలో పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా మీడియా బ్రీఫింగ్ ఇవ్వాలని అందుకు భాద్యత గల వ్యక్తుల ద్వారా,జిల్లా కలెక్టర్, జేసి,పిఒ, సబ్ కలెక్టర్లకు వివరాలు అందించాలని ఆదేశించారు.
అదేవిధంగా వరదలు తగ్గిన తరువాత చేపట్టవలసిన కార్యక్రమాల గూర్చి కలెక్టర్ వివరించారు.నీరు తగ్గినా వెంటనే బురద, చెత్తా,చెదారం తొలగింపుతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, తెగిన విధ్యుత్ వైర్లు, చెట్లకొమ్మలు తొలగింపు, గోతులు పూడ్చివేత కార్యక్రమాలు చేపట్టాలని, వీలైనంత త్వరగా పునరావాస కేంద్రాలనుండి వెనుకకు వెళ్లేందుకు సహకరించాలని సూచించారు.పాడైన బోర్లు, నిలిచిన విధ్యుత్ సరఫరా పునరుద్ధరణ, అంటువ్యాధుల నుండి రక్షణ మందులు అందించటం లాంటి చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.అన్ని శాఖల పరస్పర సహాయ సహాకారాలతో వరదలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఏటపాక, విఆర్ పురం, చింతూరు, కూనవరం తహసిల్దార్లు, ఎంపిడిఓలతో మాట్లాడి వారి ప్రణాళీకలను, వారి అవసరాలను కలెక్టర్ తెలుసుకున్నారు.అదేవిధంగా అన్ని ముఖ్యమైన శాఖల అధికారులతో మాటాడి వారి అవసరాలను, ప్రణాలికలను తెలుసుకున్నారు.
జేసి భావన వశిస్ట్ మాట్లాడుతూ, అవసరమైన రేషన్ బఫర్ స్టాక్ ఉండేవిధంగా, అవసరమైన డీజిల్, కిరోసిన్ స్టాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే మాట్లాడుతూ ఐసిడిఎస్ వద్ద పాలు,గుడ్లు అందుబాటులో ఉంటాయని వాటిని 15 రోజులు ముందుగానే పంపిణీ చేస్తే బాగుంటుందని, రహదారులు, నదులు వెంట ఉన్న పొదలు తొలగిస్తే సరుకులు,వరద భాదితుల తరలింపు సులభతరం అవుతుందని, కూరగాయలు స్థానికంగా సేకరిస్తే మంచిదని, ఆశ్రమ పాటశాలలకు పది రోజుల ముందుగానే కూరగాయలు సరఫరా చేస్తే మంచిదని తెలిపారు.చింతూరు పిఒ మాట్లాడుతూ వరదలలో భాదితుల తరలింపుకు అన్ని చర్యలు తీసుకున్నామని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామని, అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.చింతూరు ఎఎస్పి మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ, అన్ని శాఖలతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంటామని, కటాఫ్ పాయింట్ వద్ద పోలీసును నియమిస్తామని, వాలంటీర్ల సేవలను వినియోగిస్తామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ భావన వశిస్ట్, ఐటిడిఎ పిఒలు సూరజ్ గనోరే, వి. చైతన్య, చింతూరు ఎఎస్పి, ఆర్ అండ్ బి అధికారులు, వైద్య ఆరోగ్య శాఖాధికారులు, ఐసిడిఎస్ అధికారులు, అగ్నిమాపక, నీటి సరఫరా అధికారులు, నాలుగు ముంపు మండలాల తహసిల్దార్లు, ఎంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.