క్రిటికల్ అంగన్వాడీ కేంద్రాలను గుర్తించండి

 

 

👉అంగన్వాడిలు సరిగా పని చేయకపోతే సంబంధిత సూపర్వైజర్, సిడిపిఓ మీద చర్యలు

👉అంగన్వాడీలకు సరుకులు సరిగా అందించని డీలర్లపై చర్యలు

👉బాల్య వివాహాలు నియంత్రణపై అవగాహన కల్పించండి

స్టాప్ రిపోర్టార్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై16: జిల్లాలో మొబైల్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ,సూపర్వైజర్, సిడిపిఓ ఖాళీలు,పిల్లలు హాజరు తక్కువ,సప్లై పాయింట్ నుంచి దూరం,గ్రోత్ మానిటరింగ్,మెటర్నల్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ,తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని క్రిటికల్ కేంద్రాలను గుర్తించాలని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరం నుండి అంగన్వాడి కార్యకలాపాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు సూచనలు జారీ చేశారు.ముఖ్యంగా పౌష్టికాహారం సరఫరా పై ఆరా తీశారు.అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కార్యకర్త సరిగా పనిచేయనట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.వారిపై విచారణ జరిగాక తప్పు జరిగిందని నిర్ధారణకు వచ్చినప్పటికీ సంఘాల ద్వారా ప్రెజర్ చేస్తే సంఘాల లీడర్లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ముందుగా జిల్లాలో సగటు హాజరును అడిగినప్పటికీ సూపర్వైజర్, సిడిపిఓ,పిడి సరిగా స్పందించకపోవడం,డాటా లేకుండా హాజరు కావడంపై కలెక్టర్ అసహనాన్ని వ్యక్తపరిచారు.తదుపరి సమావేశానికి ఆఫ్లైన్ ఆన్లైన్ హాజరును డేటా రూపంలో సమర్పించాలని ఆదేశించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సరఫరా చేస్తున్న పది రకాల పౌష్టికాహారాలపై బాగుంది లేదా బాగోలేదు అనేది గుర్తించి ర్యాంకింగ్ ఇవ్వాలని సూచించారు.ర్యాంకింగ్ ఆధారంగా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పౌష్టికాహార నిల్వలకు అవసరమైన స్టోర్ రూమ్లను గుర్తిస్తే కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు.అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరిగా సరఫరా చేయటం లేదని, అమ్ముకుంటున్నారని, గడువు తీరిన సరుకులను అందిస్తున్నారని పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో సరుకుల ర్యాంకింగ్ తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పలువురు సిడిపివోలు మాట్లాడుతూ సరఫరాల సమస్య ఉందని,ఎండియు వాహనం రావడం లేదని, బయోమెట్రిక్ వేసిన తర్వాత సరుకులు పంపడం లేదని, పలుచోట్ల డీలర్ల సమస్య ఉందని,కొన్నిచోట్ల వంట నూనె సరఫరా సరిగా లేదని,గుడ్లు నాణ్యత బాగోలేదని,తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.కలెక్టర్ స్పందిస్తూ నాణ్యతలేని వస్తువులను వెనక్కి పంపించాలని సూచించారు. అదేవిధంగా సరుకుల పంపిణీకి సంబంధించి ప్రతి మండలంలో ముగ్గురు సిబ్బందితో బృందాన్ని ఏర్పాటు చేసి సరుకులు సరఫరా చేయని వారి వివరాలను దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎండియూ ఆపరేటర్ రాకపోతే వారిని తొలగించడం జరుగుతుందని,సరుకులను సరిగా సరఫరా చేయని డీలర్లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఎఫ్ పి షాప్ కు వెళ్లిన సరుకుల వివరాలు అసిడియస్ టిడిపి తెలియాలని అందుకు సంబంధించిన డాటా ఉండాలని కలెక్టర్ సూచించారు.ఉన్నత స్థాయిలో ఇచ్చిన సూచనలు క్రింది స్థాయి వరకు చేరేలా చూడాలని, తద్వారా సరిగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మంచిగా చేసిన అంగన్వాడి,సూపర్వైజర్లను అభినందించడంతోపాటు వారికి అవార్డులు చేస్తామని, అదే సమయంలో సరిగా పనిచేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీలు సరిగా పనిచేయకపోతే సంబంధిత సూపర్వైజర్లు,సిడిపిఓ లను బాధ్యులను చేయడం జరుగుతుందని హెచ్చరించారు.అంగన్వాడి కేంద్రాలకు సంబంధించి మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారుచేసిన వారికి అభినందించడంతోపాటు మిగిలిన కేంద్రాలకు కూడా పంపిస్తామని తెలిపారు. అదేవిధంగా కనీస పరిజ్ఞానం లేని అంగన్వాడీలు వారి మొబైల్ల ద్వారా వాడి పిల్లలకి అవసరమైన విద్యా బోధన వీడియోలు చూపించాలని, వారితో ఎక్కువగా మాట్లాడాలని తద్వారా పిల్లలలో మానసిక శారీరక ఎదుగుదల బుద్ధి మాంద్యం లాంటి లోపాలను లేకుండా చూడగలమని వివరించారు. బాల్య వివాహాలు నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సిడిపివోలు,ఎంపీడీవోలతో కలిసి గ్రామాలలో సమీక్షించాలని,చైల్డ్ మ్యారేజ్ కమిటీలో సర్పంచులను గ్రామ పెద్దలను చేర్చాలని,బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలను వివరించాలని,క్రిస్టియన్ ఫాదర్లను,హిందూ పూజారులను కలసి బాల్యవాహాలు జరుపకుండా అవగాహన కల్పించాలని ఆదేశించారు.ఇప్పటికీ పిల్ల బరువన్న కారణంగా బాల్య వివాహాలు చేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ప్రవేశం కల్పించాలని సూచించారు. అదేవిధంగా బాల్యవాహం జరిపించే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి నష్టాలను, చట్టాలను,చట్ట ప్రకారం చర్యలను అవగాహన కల్పించడం ద్వారా బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు.ప్రతి గ్రామ వారీగా పిల్లల వయసు బరువు,చదువు,వివాహ వయసు తదితర అంశాలతో డాటా తయారు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్. సూర్యలక్ష్మి,పాడేరు డివిజన్లో 11 ప్రోజెక్టుల సిడిపివోలు, సూపర్వైజర్లు పాల్గొనగా, రంపచోడవరం చింతూరు డివిజన్లోని ఎనిమిది ప్రాజెక్టుల సిడిపివోలు సూపర్వైజర్లు వర్చువల్ గా పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.